చిరుత పిల్లల దాడిలో మహిళకు గాయాలు
ఐరాల: చిరుత పిల్లల దాడిలో ఓ మహిళకు స్వల్ప గాయాలైన సంఘటన ఐరాల మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. మండల డిప్యూటీ రేంజ్ అధికారి రాకేష్‌కుమార్ కథనం మేరకు.. ఐరాల మండలంలోని పుత్రమద్దికి చెందిన కాంతమ్మ (పుట్టుకతో మూగ) తన పాడి ఆవును శనివారం సాయంత్రం గ్రామం సమీపంలోని పసలకొండపై మేతకు వదిలింది. ఆవు మేత మేస్తుండగా సమీపంలోని ఓ చిన్న గుంతలో చిరుతతో పాటు రెండు చిరుత పిల్లలు నీరు తాగుతుండడం గమనించింది. వాటిని చూసి భయపడి బిగ్గరగా అరవలేక.. రాయి తీసుకొని వాటిపై విసిరింది. దీంతో చిరుత పిల్లలు ఆమైపె దాడిచేసి కాలి గోర్లతో రక్కాయి. చిరుత దాడి చేయకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రాణాలతో బయటపడ్డ కాంతమ్మ గ్రామానికి చేరుకొని జరిగిన విషయాన్ని తన సైగలతో గ్రామస్తులకు వివరించింది. అటవీ శాఖ సిబ్బంది గ్రామస్తులతో కలిసి సోమవారం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పశువుల మేత కోసం పసల కొండపైకి వెళ్లరాదని గ్రామస్తులకు చెప్పారు.


