జిల్లాలో 20 సెం.మీ వర్షపాతం నమోదు
చిత్తూరు కలెక్టరేట్ : దిత్వా తుపాను ప్రభావంతో జిల్లాలో ఆదివారం 20 సెం.మీ మేర వర్షపాతం నమోదైంది. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు ముసురు కమ్ముకుంది. చల్లటి గాలులు వీస్తూ వాతావరణం చల్లబడింది. నవంబర్ 30వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అధికారులు వెల్లడించిన నివేదికల ప్రకారం జిల్లా వ్యాప్తంగా 205.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఉదయం 8.30 గంటల వరకు 184.2 మి.మీ, ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 4.4 మి.మీ, మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 16.6 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలో 18.8 మి.మీ, అత్యల్పంగా చిత్తూరు నియోజకవర్గం గుడిపాల మండలంలో 2.4 మి.మీ వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. జిల్లాలోని 24 మండలాల్లో 280 గ్రామ సచివాలయాల పరిధిలో దిత్వా తుపాను ప్రభావం ఉన్నట్లు అధికారులు తెలిపారు. తుపాను కారణంగా జిల్లాలోని ఎంపీడీవోలు, తహసీల్దార్‌లు, సచివాలయ సిబ్బంది కచ్చితంగా ప్రధాన కేంద్రాల్లో ఉండాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. ఆదివారం రాత్రి, సోమవారం రోజున జిల్లాలోని 14 మండలాల్లోని 168 గ్రామాల్లో తుపాను ప్రభావం ఉండే అవకాశం ఉంటుందని అధికారులు వెల్లడించారు. క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉంటూ ముందస్తు సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
నేడు ప్రజాసమస్యల
పరిష్కార వేదిక
చిత్తూరు కలెక్టరేట్ : కలెక్టరేట్‌లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉదయం 9.30 నుంచి మధ్యా హ్నం ఒంటి గంట వరకు ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సమావేశానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలన్నారు.


