మహిళా ఉద్యోగులను వేధించడం సరికాదు
ఐరాల : స్థానిక పీహెచ్‌సీలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులను వైద్యాధికారి రెడ్డెప్ప వేధించడం సబబు కాదని ఏపీఎన్‌జీఓ అసోసియేషన్, ప్రజా ఆరోగ్య ఉద్యోగుల సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం పీహెచ్‌సీ వద్ద మహిళా ఉద్యోగులతో కలిసి వారు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శివయ్య మాట్లాడుతూ.. పీహెచ్‌సీలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులను రెడ్డెప్ప వేధిస్తున్నారన్న ఫిర్యాదు శుక్రవారం డీఎంహెచ్‌ఓకు చేరిందన్నారు. దీనిపై సంఘం నాయకులతో కలిసి వారు పడుతున్న వేధింపులపై ఆరా తీశామన్నారు. ఆశా వర్కర్లను పీహెచ్‌సీలో రాత్రి పూట విధులు నిర్వర్తించాలని, సెలవు కావాలని అడిగితే సంబంధం లేని వ్యక్తికి డబ్బులు ఇచ్చి సెలవు మంజూరు చేసుకోవాలని చెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రతి మహిళా ఉద్యోగి సమస్యపై డబ్బే ప్రధానంగా వ్యవహరిస్తున్న తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. మహిళా ఉద్యోగులను అసభ్య పదజాలంతో దూషిస్తూ, మనోవేదనకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా ఉద్యోగులకు అన్ని విధాలుగా సంఘం నాయకులు అండగా ఉంటామని, న్యాయం జరిగే వరకు పోరాడుతామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యోగుల సంఘం నాయకులు లక్ష్మీనారాయణ, మహేష్‌కుమార్, భానుప్రకాష్, దేవకుమార్, సురేంద్రనాథ్‌రెడ్డి, మోహన్, శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు.


