దళితులపై కక్ష సాధింపా? | - | Sakshi
Sakshi News home page

దళితులపై కక్ష సాధింపా?

Nov 30 2025 7:36 AM | Updated on Nov 30 2025 7:36 AM

దళితు

దళితులపై కక్ష సాధింపా?

● ఆక్రమణ అంటూ ఇల్లు కూల్చేందుకు వెళతారా? ● అధికారులు అధికార పార్టీ నేతలకు తొత్తులుగా వ్యవహరించొద్దు ● మున్సిపల్‌ అధికారులపై విరుచుకుపడ్డ కౌన్సిలర్లు ● రసాభాసగా మున్సిపల్‌ సమావేశం

నగరి : అధికార పార్టీ నేతలు ఒత్తిడి తెస్తున్నారంటూ దళితులపై కక్ష సాధింపునకు దిగుతారా? మున్సిపల్‌ కౌన్సిలర్‌ హోదాలో ఉన్న మహిళను వేధింపులకు గురిచేస్తారా అంటూ మున్సిపల్‌ కౌన్సిలర్లు అధికారులపై విరుచుకుపడ్డారు. శని వారం ఉదయం మున్సిపల్‌ చైర్మన్‌ పీజీ నీలమేఘం అధ్యక్షతన మున్సిపల్‌ సమావేశం నిర్వహించారు. తొలుత అజెండాలోని అంశాలను అధికారులు వివరించిన అనంతరం కౌన్సిలర్లు మూకుమ్మడిగా అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. కరకంఠాపురం వద్ద రోడ్డుకు ఆనుకొని ఆక్రమణలు ఉన్నాయంటూ మున్సిపల్‌ అధికారులు వాటిని కూల్చేందుకు వెళ్లి కౌన్సిలర్‌ చినపాపను, ఆమె కుటుంబ సభ్యులను వేధింపులకు గురిచేయడంపై అధికారులను వివరణ కోరారు. మున్సిపల్‌ పరిధి సత్రవాడ నుంచి నగరి వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలను ఇలాగే తొలగించేందుకు అధికారులు సిద్ధమా అని ప్రశ్నించారు. దళిత మహిళకు చెందిన ఆస్తులు అంటే వాటిపై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారా? కౌన్సిలర్‌కే ఈ పరిస్థితి అంటే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటన్నారు. వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నందుకు అధికార పార్టీ చేపట్టే కక్షసాధింపు చర్యలకు మీరు వత్తాసు పలుకుతున్నారా అంటూ అధికారులను నిలదీశారు. దీనిపై కమిషనర్‌ కృష్ణారెడ్డి మాట్లాడుతూ రెవిన్యూ నుంచి మాకు అందిన ఆదేశాల మేరకే మేము వ్యవహరిస్తున్నామన్నారు. అయితే పసుపులేట్‌ నగర్‌లో వీధికి అడ్డంగా ఆక్రమణలు జరుగుతుంటే చేసిన ఫిర్యాదులపై ఎందుకు చర్యలు చేపట్టలేదని కౌన్సిలర్‌ గోపాల్‌రెడ్డి ప్రశ్నించారు. అంటే దళితులకు ఒక న్యాయం? ఇతరులకు ఒక న్యాయం చేస్తున్నారా ఇదేనా సుపరిపాలన అన్నారు.

కలుషిత రంగు నీటిపై ఎందుకు స్పందించరు

అధికార పార్టీ నేతల ఆజ్ఞలకు ఆగమేఘాలపై వెళ్లే అధికారులు కలుషిత రంగునీటి సమస్యను పరిష్కరించాలని గొంతు చించుకుంటున్నా ఎందుకు స్పందించరు అంటూ ము న్సిపల్‌ కౌన్సిలర్లు బీడీ భాస్కర్‌, బిలాల్‌, ఇంద్రయ్య ప్రశ్నించారు. రంగు నీరు ఎక్కడ వస్తుందో సభ్యులు తెలిపితే అంద రం కలిసి వెళ్లి పరిశీలిద్దాం అంటూ కమిషనర్‌ జవాబిచ్చారు.

మొండి బకాయిల రైట్‌ ఆఫ్‌కు ఒప్పుకోం

స్థానిక సంత మైదానంలో ఉన్న 27 మున్సిపల్‌ షాపులను 2016 నుంచి వేలంలో గుత్తకు పాడుకున్న పలువురు మున్సిపాలిటీకి చెల్లించాల్సిన గుత్త బకాయిలు రూ.64.77 లక్షలు ఉందని అవి మొండి బకాయిలుగా వసూలు చేసేందుకు వీలుపడనందున వాటిని రైట్‌ ఆఫ్‌ చేయడానికి కౌన్సిల్‌ అనుమతి కోరుతూ అధికారులు అజెండాలో ఉంచారు. దీనిపై విప్‌ దయానిధి మాట్లాడుతూ మొండి బకాయలు వసూలు చేయడానికి అధికారులు చొరవ చూపాలని రైట్‌ ఆఫ్‌ చేస్తే ఇది ఒక సాంప్రదాయంగా మారిపోతుందన్నారు. దీనికి కౌన్సిలర్లు అందరూ మద్దతు పలికారు.

నేలపై కూర్చుని నిరసన వ్యక్తం చేస్తున్న కౌన్సిలర్‌ చినపాప

మున్సిపల్‌ అధికారులను ప్రశ్నిస్తున్న కౌన్సిలర్లు

నేలపై కూర్చుని కౌన్సిలర్‌ నిరసన

17వ వార్డు కౌన్సిలర్‌ చినపాప తన పట్ల అధికారులు వ్యవహరించిన తీరు ఎంతో బాధించిందని, అధికారులు ఎలా చేశారో జవాబు చెప్పాలంటూ సమావేశంలో నేలపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. దీంతో చైర్మన్‌, కౌన్సిలర్లు తాము అధికారులతో ఈ విషయంగానే చర్చిస్తున్నామని లేచి పైన కూర్చోవాలంటూ ఆమెకు నచ్చజెప్పారు.

మున్సిపల్‌ పాలక వర్గానికి విలువ లేదా?

మున్సిపల్‌ కౌన్సిలర్లపైనే చర్యలు చేపట్టే విషయంలో చైర్మన్‌గా అధికారులకు విన్నవించుకున్నా ఏ మాత్రం లెక్కచేయలేదని మున్సిపల్‌ పాలక వర్గానికి ఏ విలువా లేదా? అంటూ మున్సిపల్‌ చైర్మన్‌ పీజీ నీలమేఘం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అధికారులు వ్యవహరించడం గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. సమావేశంలో వైస్‌ చైర్మన్లు బాలన్‌, వెంకటరత్నం రెడ్డి, మున్సిపల్‌ డీఈ రవీంద్ర, హౌసింగ్‌ డీఈ భాస్కర్‌, డిప్యూటీ తహసీల్దార్‌ మేఘవర్ణం, అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ శంకరమ్మ, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

దళితులపై కక్ష సాధింపా?1
1/1

దళితులపై కక్ష సాధింపా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement