విద్యార్థికి పొగాకు ఉత్పత్తుల విక్రయం
చిత్తూరు అర్బన్ : పాఠశాలలు, కళాశాలల ఆవరణల్లో పొగాకు ఉత్పత్తులను విద్యార్థులకు విక్రయిస్తున్న వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తప్పవని చిత్తూరు టూటౌన్ సీఐ నెట్టికంటయ్య హెచ్చరించారు. శనివారం నగరంలోని తోటపాళ్యం, వన్నియర్‌బ్లాక్, సంతపేట ప్రాంతాల్లోని విద్యా సంస్థల ఆవరణల్లో ఉన్న పలు దుకాణాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆరో తరగతి చదువుతున్న పిల్లాడి వద్ద రూ.50 ఇచ్చిన పోలీసులు అతడికి ఓ దుకాణానికి పంపించి, పొగాకు ఉత్పత్తి తీసుకురమ్మని పురమాయించారు. ఆ విద్యార్థికి దుకాణ నిర్వాహకుడు పొగాకు ఉత్పత్తిని విక్రయించాడు. అనంతరం దుకాణ యజమానికి పట్టుకున్న పోలీసులు స్టేషన్‌కు తరలించారు. అలాగే నగరంలోని చాలా ప్రాంతాల్లో ఈ ఆపరేషన్‌ను కొనసాగించారు. డబ్బులిస్తే చాలు, వయస్సుతో తేడా లేదన్నట్టు పొగాకు ఉత్పత్తులను యథేచ్ఛగా విక్రయించేస్తున్నారు. ఇలా చిత్తూరు నగరంలోని వందలాది ప్యాకెట్ల గుట్కా, హాన్స్, కై నీ, సిగరెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. పలువురు వ్యాపారులను బైండోవర్ చేశారు. మళ్లీ ఇదే పొరపాటు చేస్తే, ఈసారి కేసులు నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు.


