యూరియాపై కర్రపెత్తనం!
అధికార పార్టీ నేతలకే
మొదటి ప్రాధాన్యం
ఆ తర్వాతే సామాన్య రైతులకు
బహిరంగంగానే ఆయా పార్టీ నేతలకు టోకెన్లు
పట్టించుకోని ఉన్నతాధికారులు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో యూరియాను నొక్కేస్తున్నారు. మీకింత..మాకింత అంటూ పంచుకుంటున్నారు. కూటమి నేతల ఇంటికే టోకెన్లు పట్టుకెళుతున్నారు. బహిరంగంగానే నేతలకు టోకెన్లను పంపిణీ చేస్తున్నారు. అదే సమయంలో సామాన్య రైతుకు చుక్కలు చూపిస్తున్నారు. యూరియా వెతలపై మండల వ్యవసాయశాఖ అధికారులకు ఫిర్యాదులు వెలువెత్తున్నాయి. కూటమి నేతల జోక్యంతో సంబంధిత అధికారులు వాటిని కొట్టిపడేస్తున్నారు.
జిల్లాలో రబీ సాధారణ విస్తీర్ణం 28 వేల హెక్టార్లు కాగా.. వరి సాధారణ విస్తీర్ణం 10 వేల హెక్టార్లు. ఇప్పటి వరకు 10 వేల హెక్టార్లలో వ్యవసాయ ఆధారిత పంటలు సాగు కాగా.. వరి మాత్రం 600 హెక్టార్లలో సాగులోకి వచ్చింది. డిసెంబర్‌లో సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జిల్లాలో 3,300 మెట్రిక్ టన్నుల యూరియా
జిల్లా వ్యాప్తంగా 3,300 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. 314 ఆర్బీకేలలో 2,400 టన్నులు, నాలుగు సొసైటీలో 20 టన్నులు, 80 ప్రైవేటు షాపుల్లో 106 మెట్రిక్ టన్నులు నిల్వలున్నాయి. అయితే ఈ నిల్వల్లో తేడాలు ఉన్నట్టు రైతులు చెబుతున్నారు.
చిత్తూరు మండలంలోని ఓ సచివాలయ పరిధిలో వ్యవసాయశాఖ సహాయకులు టీడీపీ నేతలు ఉన్న గ్రామంలో ఇంటింటికీ వెళ్లి టోకెన్లు పంపిణీ చేశారు. ఇది గమనించిన సామాన్య రైతులు ఆ సిబ్బందికి ఫోన్ చేసి టోకెన్లు అడిగారు. మీరు సచివాలయం వద్దకు రావాలని చెప్పారు. అక్కడొచ్చాక టోకెన్లు లేవని చేతులెత్తేశారు. విషయాన్ని కొందరు టీడీపీ నేతలు, రైతులు మండల వ్యవసాయశాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. స్పందించిన సదరు అధికారి ఇబ్బంది లేకుండా యూరియా పంపిణీ చేస్తామని సర్దుబాటు చెప్పారు.
వరికి సిద్ధమా?
వచ్చే నెల నుంచి వరి సాగు చేయడానికి రైతులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే చాలామంది వరినాట్లు నాటారు. మరింత మంది వరినారు పోశారు. కొంతమంది నాట్లు వేసేందుకు పొలాలను సిద్ధం చేసి ఉంచారు. వరి సాగు విస్తీర్ణం 600 హెక్టార్ల నుంచి 5 వేలలోపు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే సాగుకు అవసరమైన యూరియాను అందించడంలో జాప్యం జరుగుతోందని రైతులు వాపోతున్నారు.
.. ఇది ఒక్క చిత్తూరులోనే కాదు.. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి. అధికార బలంతో కొందరు నేతలు యూరియాపై కర్రపెత్తనానికి పూనుకుంటున్నారు. ముందు తమకు అందిస్తేనే.. తర్వాత ఎవరికై నా ఇవ్వండంటూ అధికారులకు హుకుం జారీ చేస్తున్నారు. దీనిపై సామాన్య రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఎరువుపైనా పెత్తనం
యూరియాపై పలువురు కూటమి నేతలు పెత్తనం చేస్తున్నారు. ముందస్తుగానే ఆర్డర్లు వేస్తున్నారు. నాకు 10 బ్యాగులు.. 20 బ్యాగులు కావాలని వ్యవసాయశాఖ సిబ్బందికి ఫోన్ చేసి వేధిస్తున్నారు. మరికొంత మంది ఇంటికొచ్చి టోకెన్లు ఇచ్చిపోవాలని హుక్కుం జారీ చేస్తున్నారు. దీంతో కొంతమంది సిబ్బంది వారి ఇంటికెళ్లి టోకెన్లు ఇచ్చి వస్తున్నారు. కొందరు సిబ్బంది బహిరంగంగా టోకెన్లు ఇస్తే..మరికొందరు లోలోపల టోకెన్లు పంపిణీ చేస్తున్నారు. ఇక దొంగచాటుగా యూరియా బ్యాగులు నేతల ఇంటికి వెళుతున్నాయని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. కూటమి నేతల ఒత్తిడి తాళలేక వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బంది తలలుపట్టుకుంటున్నారు. అధికారులు స్పందించి యూరియాలో తప్పిదాలు జరగకుండా చూడాలని వేడుకుంటున్నారు.
యూరియాపై కర్రపెత్తనం!


