కుడితే.. కుదుపే!
కాణిపాకం: స్క్రబ్ టైఫస్ వ్యాధి పేరు వింటేనే టెర్రర్ పుడుతోంది. ప్రస్తుతం జిల్లాలో ఈ వ్యాధి హడలెత్తిస్తోంది. మలేరియా, డెంగీ వంటి దోమకాటు జ్వరాలతో పాటు తాజాగా టైఫస్ జ్వరాలు ప్రజలను ఇబ్బందిపెడుతున్నాయి. క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. పల్లెల్లోనే అధికంగా ఈ రకమైన కేసులు నమోదవుతున్నాయి. చిత్తూరు, గుడిపాల మండలంలోనే అత్యధికంగా కేసులు నమోదుకావడం కలవరపాటుకు గురిచేస్తోంది.
బుష్ టైప్ బుసకొడితే
స్క్రబ్ టైఫస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ బుష్ టైఫస్ అనే పేరుంది. దట్టమైన చెట్లు, వ్యవసాయ భూములు పక్కన నివసించే వారికి ఎక్కువుగా స్క్రబ్ టైఫస్ వ్యాధి సోకుతుంది. చెట్లు, పొలాల్లో దోబూచులాడే ఈ కీటకం కుట్టినప్పుడు చర్మం ఎక్రబారడం, దురదరావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి కుట్టడం వల్ల ఓరియోంటియా సుసుగాముషి అనే బ్యాక్టీరియా దేహంలోకి ప్రవేశించడంతో ఈ స్క్రబ్ టైఫస్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ కీటకం కుట్టడం ద్వారా జ్వరం వస్తుంది. ఈ కీటకాల్లో కొన్ని తీవ్రమైన ప్రభావం చూపుతాయి. శరీరంపై పరిశీలిస్తే కీటకం కుట్టిన ప్రాంతంలో నల్లటి మచ్చ కనిపిస్తుంది.
లక్షణాలు
అధిక జ్వరం, తీవ్రమైన చలి, కొంత మందికి దగ్గు, తలనొప్పి, ఒళ్లునొప్పులు, నీరసం, ముదిరితే కామెర్లు, ఫిట్స్ లక్షణాలు కనిపిస్తాయి. న్యూమోనైటీస్.. తీవ్రమైన ఊపిరితిత్తుల గాయం, ఎక్యుట్ రెస్పిరేటరీ డిస్ట్సెస్ సిండ్రోమ్ వంటి వాటికి గురవుతుంటారు. కిడ్నీలు ఫెయిల్యూర్ కావడం, హృదయ కండరాల వాపు, సెప్టిక్ షాక్, అంతర్గత రక్తస్రావం, తెల్ల రక్తకణాలు తగ్గిపోవడం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. కాలే యం, మూత్ర పిండాల పనితీరు అసాధారణ స్థితికి చేరుకోవచ్చు.
వీళ్లు జాగ్రత్త
స్క్రబ్‌టైప్ వ్యాధి, మధుమేహం, హైపర్ టెన్షన్ ఉన్న వారికి సోకితే ప్రమాదకరం. అంతే కాకుండా హెచ్‌ఐవీ రోగులకు సోకితే ప్రాణాంతకమే. చిన్న పిల్లలు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి సోకితే ప్రమాకరంగా మారుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాఽధికి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం లేదని బాధితులు వాపోతున్నారు.వేలూరు, బెంగళూరు, చైన్నె, తిరుపతిలోని ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.
ఇక్కడే అధికం
జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసులు ఏడాది కాలంలో 300కుపైగా నమోదైనట్టు వైద్యనిపుణులు చెబుతున్నారు. అధికారికంగా మాత్రం 150కి పైగా కేసులు నమోదైనట్లు లెక్కలు చెబుతున్నా యి. చిత్తూరు, గుడిపాల, ఐరాల, బంగారుపాళ్యం మండలాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు వలస వెళ్లిన వ్యక్తులు కూడా స్క్రబ్‌టైపస్ బారినపడుతున్నారు.


