చర్చకు రాని ప్రజా సమస్యలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా సమన్వయ అభివృద్ధి, పర్యవేక్షణ కమిటీ (దిశా) సమీక్షలో ప్రజాసమస్యలు చర్చకు రాలేదు. జిల్లా వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అనేక సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయి. క్షేత్ర స్థాయిలో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రజలు ప్రతి సోమవారం పీజీఆర్‌ఎస్‌కు క్యూ కడుతున్నారు. కానీ ప్రజల సమస్యలపై దృష్టి పెట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది.
ప్రజాప్రతినిధులే డుమ్మా
ముఖ్యమైన సమావేశాలకు జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడం విమర్శలకు తావిస్తోంది. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన దిశా సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. పలు శాఖల అధికారులు సైతం గైర్హాజరయ్యారు. చిత్తూరు, జీడీనెల్లూరు, నగరి, పలమనేరు ఎమ్మెల్యేలు హాజరు కాలేదు.
అవి ఎందుకు అలానే ఉన్నాయ్?
జిల్లా వ్యాప్తంగా ఎన్నో ఏళ్ల ముందు మొదలుపెట్టిన గృహ నిర్మాణాలు ఎందుకు ఇంకా అలానే ఉన్నాయని ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు హౌసింగ్ పీడీని ప్రశ్నించారు. నిధులు మంజూరు చేసినప్పటికీ లబ్ధిదారులు సగంలోనే గృహ నిర్మాణాలు ఎందుకు ఆపేస్తున్నారని ప్రశ్నించారు. కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ మాట్లాడుతూ జిల్లాలో 53,338 గృహా నిర్మాణాలు పూర్తయినట్లు తెలిపారు. ప్రతి నెలా 300 గృహాలు పూర్తి చేసే లా చర్యలు చేపడుతున్నామన్నారు.


