పటిష్టంగా పులుల గణన
– జీపీఆర్‌ఎస్ ఆధారంగా ప్రక్రియ
పలమనేరు : అటవీ ప్రాంతాల్లో పులుల గణనను పటిష్టంగా చేపట్టాలని సీసీఎఫ్ యశోధబాయి ఆదేశించారు. శుక్రవారం పలమనేరు సమీపంలోని కుంకీ ఎలిఫెంట్ క్యాంపులో చిత్తూరు, అనంతపురం, పుట్టపర్తి జిల్లాల అటవీశాఖ అధికారులు, సిబ్బందికి పులుల గణనపై అవగాహన కల్పించారు. సీసీఎఫ్ మాట్లాడుతూ నాలుగేళ్లకు ఒకసారి చేపట్టే గణన ఆధారంగానే వన్యప్రాణులు, వన్యమృగాల లెక్క పక్కాగా తేలుతుందన్నారు. ప్రాణుల వేలిముద్రల ఆధారంగా లెక్కింపు జరిగేదని, ప్రస్తుతం టెక్నాలజీని ఉపయోగించి జీపీఎస్ ఆధారంగా యాప్ సాయంతో సాగుతోందని వెల్లడించారు. డేటా సేకరణపై బీట్ ఆఫీసర్లు, సెక్షన్ ఆఫీసర్లు, రేంజర్లకు ట్రైనింగ్ ఇచ్చామని తెలిపారు.
7శాతం పెరిగింది
దేశంలో 2022 లెక్కల ప్రకారం పులుల సంఖ్య 3,167గా ఉండగా ఇప్పుడు7శాతం పెరిగినట్టు తెలుస్తోందన్నారు. ప్రతి 15కిలోమీటర్ల పరిధిలో పులి, చిరుతల పాదముద్రలు, జుట్టు, ఎముకలు, చెట్లపై రేక్ మార్కులు, పాగ్ గుర్తులను పరిశీలించాలని సూచించారు. అలాగే రేసుకుక్కలు, నక్కలు, తోడేళ్లు, గుంటనక్క, దుమ్ములగొండి, అడవి పిల్లి, చుక్కల దుప్పి, కణుజు, మనుబోతులు, జింకలు, కొండ గొర్రె తదితరాలను లెక్కించాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీఎఫ్‌వోలు చక్రపాణి, శ్రీనివాసులు, సబ్ డీఎఫ్‌ఓ వేణుగోపాల్, ఎఫ్‌ఆర్‌ఓ నారాయణ, వైల్డ్ లైఫ్ పరిశోధకుడు రాకేష్‌కాల్వ పాల్గొన్నారు.


