డ్రగ్స్ సమాచారమిస్తే రూ.25వేలు
చిత్తూరు కలెక్టరేట్ : యువత డ్రగ్స్ జోలికెళ్లకూడదని కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ అన్నారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్‌లో యాంటీ నార్కొటిక్ గ్రూప్ ఫర్ లాబి ఎన్‌ఫోర్స్‌మెంట్ పై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో క్లస్టర్ స్థాయిలో ఆర్డీవోలు, డీఎస్సీల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మాదకద్రవ్య నిర్మూలనపై వి స్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పాఠశాలల్లో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి పిల్లల ప్రవర్తన పై కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు. డ్రగ్స్ సమాచారం ఇస్తే రూ.25 వేలు నగదు బహుమతి ఇవ్వనున్నట్టు తెలిపారు.
డ్రగ్స్‌పై ప్రత్యేక నిఘా
జిల్లాలో డ్రగ్స్ పై ప్రత్యేక నిఘా ఉంటుందని ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. పాఠశాలలు, కళాశాలల వద్ద ఉండే షాపుల్లో విస్తృతంగా తనిఖీలు చేయిస్తామన్నారు. సింగిల్ పేరెంట్ పిల్లలు, పదో తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులు ఎక్కువగా మాదకద్రవ్యాలకు అలవాటు పడుతున్నట్లు గుర్తించామన్నారు. డీఎల్‌ఎస్‌ఏ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి భారతి మాట్లాడుతూ పిల్లలకు చిన్నవయస్సు నుంచే చెడు అలవాట్ల వల్ల కలిగే నష్టాలను తెలియజేయాలన్నారు. డ్రగ్స్ కు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే 1972, 8977781972 నంబర్లకు తెలియజేయాలని సూచించారు. అనంతరం డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన పోస్టర్‌లను ఆవిష్కరించారు. జిల్లా సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణ, ఎంఈవోలు, హెచ్‌ఎంలు, పాల్గొన్నారు.


