రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
గుడిపాల: రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందినట్లు గుడిపాల ఎస్‌ఐ రామ్మోహన్ తెలిపారు. ఆయన కథనం.. గుడిపాల మండలం, పల్లూరు ఆదిఆంధ్రవాడకు చెందిన శ్రీలేఖ(37), బుజ్జి(45) చిత్తూరు నుంచి ఏపీ–03–టీహెచ్–0540గల షేర్ ఆటోలో వస్తున్నారు. చైన్నె–బెంగళూరు జాతీయ రహదారి సీఎంసీ ఆస్పత్రి ఆవరణలో వెనుక వైపు నుంచి వస్తున్న ఏపీ–37–టీసీ–5799గల టెంపో ట్రావెలర్ షేర్ ఆటోను గుద్దింది. శ్రీలేఖ ఆటోలో నుంచి రోడ్డుపై పడడంతో తలకు బలమైన గాయం తగిలింది. వెంటనే 108 ద్వారా చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. బుజ్జికి స్వల్పగాయాలయ్యాయి. కేసు దర్యాప్తులో ఉంది.
రక్తం చూసిన వరి కుప్పలు
పలమనేరు: బైపాస్ రోడ్డులో వేసిన వరికుప్పల కారణంగా రోడ్డు ప్రమాదం జరిగి బైక్‌పై వస్తున్న ఇద్దరు మైనర్లు తీవ్రంగా గాయపడిన ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పట్టణంలోని జెండామఠానికి చెందిన సాధు(15), జైలూ(13) బైక్‌పై బైపాస్‌లో వెళ్తున్నారు. రోడ్డుపై రైతులు టార్పాలిన్ కప్పిన వరి ధాన్యాన్ని గమనించక దానిపై వెళ్లి ప్రమాదానికి గురయ్యారు. వీరిని 108 వాహనంలో పలమనేరు ఆస్పత్రికి తరలించారు. కాగా ఇప్పుడు వరికోతల సీజన్ కావడంతో చాలామంది ధాన్యాన్ని ఎండబెట్టేందుకు స్థలం లేక రోడ్లపై ఆరబోస్తున్నారు. ఆపై సాయంత్రం అక్కడే కుప్పగాతోసి దానిపై టార్పాలిన్ కప్పి వెళ్లిపోతున్నారు. రాత్రి సమయంలో వీటిని గమనించకుండా చాలా మంది ప్రమాదాలబారిన పడుతున్నారు.
మద్యం విక్రేతల అరెస్ట్
పుంగనూరు: అక్రమంగా 120 ప్యాకెట్ల కర్ణాటక మద్యాన్ని రెండు ద్విచక్ర వాహనాల్లో తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు సీఐ సుబ్బరాయుడు తెలిపారు. సీఐ కథనం.. పట్టణానికి చెందిన మునిరాజ, అబ్రార్ అనే ఇద్దరు వ్యక్తులు రెండు మోటారు సైకిళ్లలో కర్ణాటక నుంచి 120 టెట్రాప్యాకెట్లను తీసుకు వస్తుండగా వనమలదిన్నె రోడ్డు క్రాస్‌లో పోలీసులకు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి మద్యాన్ని, ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.


