రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
గంగవరం: చిత్తూరు జిల్లాలోని వేర్వేరు మండలాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. ఎరువు లోడ్‌తో వెళుతున్న టిప్పర్, ఎదురుగా వస్తున్న కారు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన గంగవరం మండలంలోని బాలేపల్లి క్రాస్ వద్ద బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని సాయినగర్‌లో నివాసం ఉంటున్న గోపి(34) పలమనేరు పట్టణంలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో డిప్యూటీ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. పెద్దపంజాణి మండలం శంకర్‌రాయలపేటలో తన బావమరిది అయ్యప్పస్వామి మాలధారణ చేసి, ఇరుముడి కట్టుకుంటున్న నేపథ్యంలతో ఇంటి నుంచి కారులో బయలుదేరి వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా మార్గం మధ్యలోని బాలేపల్లి క్రాస్ వద్ద మలుపులో మాడి వైపు వెళుతున్న టిప్పర్, కారు రెండు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న గోపికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించి స్థానికులు క్షతగాత్రుని చికిత్స కోసం పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇదిలా ఉండగా ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. అయితే గంగవరం అంబులెన్స్ సమయానికి అందుబాటులో లేకపోవడంతో బైరెడ్డిపల్లి నుంచి అంబులెన్స్ గంట తరువాత ఘటనా స్థలానికి చేరుకుంది. అంబులెన్స్‌లో ఆక్సిజన్ కొరత కారణంగా క్షతగాత్రునికి సమయానికి ఆక్సిజన్ అందక మరణించాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
యువకుడిపై దూసుకెళ్లిన గ్రానైట్ లారీ
గంగాధర నెల్లూరు: ఓ గ్రానైట్ లారీ అతి వేగంగా వెళుతూ యువకుడుపై దూసుకెళ్లడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన జీడీనెల్లూరు మండలంలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు కథనం మేరకు మండలంలోని ఎట్టేరి సమీపంలోని అప్పిరెడ్డికండ్రిగ వద్ద చిత్తూరు పుత్తూరు జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి అప్పిరెడ్డి కండ్రిగ గ్రామానికి చెందిన హేమాద్రి (21) రోడ్డు దాటుతుండగా అతివేగంగా వచ్చిన గ్రానైట్ లారీ యువకుడిని ఢీకొంది. లారీ యువకుడిపై దూసుకు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జీడీ నెల్లూరు పోలీసులు తెలిపారు.


