ఇరుముడికి వచ్చి.. మృత్యుఒడిలోకి
నీటి మునిగి మృతి చెందిన యువకుడు
కార్వేటినగరం: మేనమామ అయ్యప్ప మాల ధరించి ఇరుముడి (పడి)పూజకు వచ్చిన యువకుడు నదిలో శవమై తేలాడు. ఈ సంఘటన మండలంలోని బట్టువారిపల్లి సమీపంలో ఉన్న కుశస్థలీనదిలో బుధవారం వెలుగుచూసింది. స్థానికుల కథనం మేరకు , చొక్కమడుగు గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి, హంస దంపతుల కుమార్తె భానుమతిని గంగాధరనెల్లూరు మండలం మహదేవ మంగళం గ్రామంలోని మురుగేష్‌రెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. వారు కుమారుడు విజయకుమార్(23)తో కలిసి బెంగళూరులో నివాసముంటున్నారు. ఈ క్రమంలో చొక్కమడుగు గ్రామంలోని విజయకుమార్ మేనమామ ఆరుముగం అయ్యప్ప స్వామికి ఇరుముడి కట్టేందుకు ఆదివారం వచ్చాడు. బుధవారం కుశస్థలీనదిలో స్థానానికి వెళ్లి ఎంతకీ రాక పోవడంతో కుటుంబసభ్యులు వెదుక్కుంటూ వెళ్లారు. నది గట్టుపై విజయ్‌కుమార్ దుస్తులు కనిపించడంతో దగ్గరికి వెళ్లి చూడగా సుమారు 25 అడుగు లోతు ఉన్న నదిలో శవమై కనిపించాడు. కేకలు వేయడంతో గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని పుత్తూరులోని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించగా వారు మృతదేహాన్ని వెలికి తీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబం
ఇటీవల అనారోగ్యంతో విజయకుమార్ తండ్రి కన్నుమూశారు. తరువాత ఏడాదిలోనే కుటంబానికి పెద్ద దిక్కు కావాల్సిన కుమారుడు కూడా ఇలా మృత్యుఒడికి చేరడంతో ఆ ఇంటి ఇల్లాలు భానుమతి గుండెలు పగిలేలా రోదించింది. త్వరలో ఇంజినీరింగ్ పూర్తి చేసి కుటుంబాన్ని అక్కున చేర్చుకుంటాడనుకున్న సమయంలో ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయావా అంటూ కుటుంబ సభ్యులు బోరున విలపించారు. దీంతో గ్రామంలో విషాదం నిండిపోయింది.


