దాత ఔదార్యం వెలకట్టలేనిది
ఐరాల: దాత ఔదార్యం వెలకట్టలేనిదని, దాత సేవలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ వరలక్ష్మి సూచించారు. బుధవారం కాణిపాకం జెడ్పీ హైస్కూల్ ప్లస్‌కు ఏఎంఎంఏసీటీఎస్, ఏసీటీఎస్ సంస్థల సీఈఓ డాక్టర్ దశరథరెడ్డి పది కంప్యూటర్లు, ప్రింటర్ వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీఈఓ హాజరై దాత చేతుల మీదుగా కంప్యూటర్ తరగతి గది ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ దాత తమ సొంత నిధులు రూ.5 లక్షల వ్యయంతో కంప్యూటర్లు, ప్రింటర్ వితరణ చేయడం సంతోషదాయకమన్నారు. విద్యార్థులు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంపొందించుకుని ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. సాంకేతిక విద్యనందించేందుకు విద్యార్థుల ప్రయోజనం కోసం కంప్యూటర్లును అందజేయడం గొప్ప విషయమన్నారు. దాత దశరథరెడ్డి మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు పరిజ్ఞానాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిపుణులైన ఉపాధ్యాయులు ఉంటారనే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాలన్నారు. విద్యార్థులు సాంకేతికతను అందిపుచ్చుకుని పాఠశాలు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ రుషేంద్రబాబు, హెచ్‌ఎం గోపీనాథ్‌రెడ్డి, వైస్ సర్పంచ్ విశ్వనాథరెడ్డి, ఎస్‌ఎంసీ చైర్మన్ భానుప్రకాష్, ఉపాధ్యాయులు సురేంద్రబాబు, సోమశేఖర్‌నాయుడు పాల్గొన్నారు.


