కష్టాల శిబిరాలు !
దివ్యాంగులు వెళ్లలేక
ఇబ్బందులు
కుప్పం: దివ్యాంగులు, వృద్ధుల సహనానికి బాబు ప్రభుత్వం పరీక్ష పెడుతోంది. సహాయ పరికరాల గుర్తింపు కోసం సుదూర ప్రాంతాల్లోని శిబిరాలకు తరలించి కష్టాల్లోకి నెడుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోని దివ్యాంగులు అంతదూరం వెళ్లలేక నానాఅగచాట్లు పడాల్సి వస్తోంది.
శిబిరాల ఎంపికలో వైఫల్యం
దివ్యాంగులకు, వృద్ధులకు సహాయ పరికారాల గురింపు కోసం ఏర్పాటు చేసిన శిబిరాల స్థలాల ఎంపిక అధికారుల వైఫల్యానికి నిదర్శనంగా మారింది. కుప్పం పట్టణ కేంద్రాన్ని వదలి గుడుపల్లెను ఎంపిక చేయడం విమర్శలకు తావిస్తోంది. అదే విధంగా నేడు జరగనున్న శిబిరం కూడా రామకుప్పం మండలం నుంచి దివ్యాంగులు 20 కి.మీ దూరంలోని శాంతిపురం మండలానికి వెళ్లాల్సి వస్తోంది.
అవస్థలే..అవస్థలు
కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన దివ్యాంగులు, వృద్ధులకు రెండు మండలాల్లో శిబిరాలు ఏర్పాటు చేశారు. మంగళవారం గుడుపల్లె హైస్కూల్‌లో గుడుపల్లె, కుప్పం మున్సిపాలిటీ, కుప్పం రూరల్ మండలాల్లోని దివ్యాంగులు శిబిరాలకు హాజరు కావాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 26న బుధవారం శాంతిపురం మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో శాంతిపురం, రామకుప్పం మండలాలకు చెందిన వారు రావాలని చెప్పారు. అయితే మంగళవారం గుడుపల్లె మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలకు హాజరయ్యేందుకు దివ్యాంగులు, వృద్ధులు అవస్థలు పడ్డారు. కుప్పం రూరల్ ప్రాతం నుంచి 50 కి.మీ ప్రయాణించి శిబిరానికి చేరుకోవాల్సి వచ్చింది. ఆటోలు, బస్సుల్లో అంత దూరం ప్రయాణించలేక దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కుప్పం పట్టణ కేంద్రాన్ని వదలి గుడుపల్లెను ఎంపిక చేయడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.


