రైల్వేస్టేషన్‌లో ముందస్తు చర్యలు
తిరుపతి అన్నమయ్యసర్కిల్: మోంథా తుపాన్ నేపథ్యంలో రైల్వేశాఖ ముందస్తు భద్రత చర్యలు చేపట్టిందని తిరుపతి రైల్వేస్టేషన్ మేనేజర్ చిన్నపరెడ్డి తెలిపారు. ప్రయాణికులు రైళ్ల సమాచారం తెలుసుకునేందుకు తిరుపతి, విజయవాడతోపాటు రాజమండ్రి, కాకినాడ, భీమవరం, తెనాలి, విశాఖ పట్టణం వంటి ముఖ్యస్టేషన్లకు సంబంధించిన రైళ్ల రద్దు, సర్వీసుల కలిగిన రైళ్ల రాకపోకల వివరాల కోసం 24 గంటలు సేవలు అందించేలా రెల్వేస్టేషన్ ప్రధాన ద్వారంలోని టికెట్టు బుకింగ్ కౌంటర్ భవనంలో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశామన్నారు. రైళ్ల రాకపోకలు, రైలు పట్టాలు, వంతెనల పరిస్థితులు, కాలువల నీటి ప్రవాహాన్ని 24 గంటలు పర్యవేక్షించేందుకు పెట్రోలింగ్ బృందాలతో పాటు కంట్రోల్ రూములు ఏర్పాటు చేశామన్నారు. రద్దయిన రైళ్ల ప్రాంతాలకు ముందుగా రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు టికెట్టు మొత్తం తిరిగి చెల్లించేందుకుగాను ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. కాగా మంగళవారం తిరుపతి నుంచి వెళ్లే పూరి ఎక్స్‌ప్రెస్, కడప నుంచి తిరుపతి మీదుగా విశాఖ పట్టణం వెళ్లాల్సిన తిరుమల ఎక్స్‌ప్రెస్, అలాగే విశాఖపట్టణం వెళ్లే ప్రత్యేక రైలు సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపారు. బుధవారం కాకినాడ నుంచి బయలుదేరే శేషాద్రి ఎక్స్‌ప్రెస్, నర్సాపురం నుంచి బయలుదేరే ధర్మవరం ఎక్స్‌ప్రెస్‌తో పాటు తిరుపతి నుంచి విశాఖపట్టణం వెళ్లే డబుల్ డెక్కర్ రైళ్ల సర్వీసులను రద్దు చేసినట్లు పేర్కొన్నారు.


