ఆగని ఆక్రమణలు
పెద్ద చెరువు..
పలమనేరు : పట్టణంలోని పెద్ద చెరువు గోస ఇప్పుడు ఎవరికీ పట్టడం లేదు. ఇప్పటికే చెరువు మొరవల వద్ద భారీగా ఆక్రమణలు చోటుచేసుకున్నాయి. కట్టను సైతం చదును చేసి లేఅవుట్లకు దారులు వేశారు. తూర్పు, పడమట మొరవల వద్ద కట్టపై భారీ భవంతులు నిర్మించారు. తాజాగా మంగళవారం కొందరు కట్ట కింద తమ భూమి ఉందంటూ నడికట్టపై గంగమ్మ గుడి వద్ద జేసీబీతో చదును చేస్తుండగా స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. కొందరి స్వార్థం కోసం పెద్ద చెరువు కట్ట కనుమరుగు అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వర్షాల కారణంగా పెద్దచెరువు మొరవ పారుతోంది. ఇలాంటి సమయంలో కట్టను ఎవరైనా ముట్టుకుంటారా? ఏ మాత్రం కట్ట దెబ్బతిన్నా కట్ట తెగడం ఖాయం. ఇలాంటి తరుణంలో కొందరు ఆయకట్టులో భూములున్న వారు కట్టపై గంగమ్మ గుడివద్ద పూజల పేరిట జేసీబీతో కట్టను చదును చేశారు. వీరి దెబ్బకు కట్ట తెగడం ఖాయమని భయపడిన స్థానికులు మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి, మున్సిపల్ ఇంజినీరింగ్, ఇరిగేషన్ అధికారులకు సమాచారమిచ్చారు. వారెవరూ పట్టించుకోకపోగా ఇరిగేషన్ ఏఈ లక్ష్మీనారాయణ మాత్రం వెంటనే స్పందించి అక్కడున్న జేసీబీని పనులు చేయకుండా అడ్డుకున్నారు.
కట్ట ఏౖమైనా తమకు సంబంధం లేదు..
ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి మాట్లాడుతూ.. పెద్ద చెరువు కట్ట ఆక్రమణలు తమ పరిధిలోకి రావని ఇరిగేషన్ అధికారులు చూసుకుంటారని జారుకున్నారు. కట్టపై పారిశుద్ధ్య పనులు, మొక్కలు నాటే మున్సిపల్ అధికారులకు వాటిపై హక్కు ఉంటుంది. కానీ కట్టను తెంచినా పట్టించుకోరట. గతంలోనూ మున్సిపల్, ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ శాఖల సమన్వయ లోపంతోనే భారీగా అక్రమ కట్టడాలు కట్టపై వెలిశాయనే ఆరోపణలు ఉన్నాయి.
మొక్కుబడిగా ఇరిగేషన్ అధికారుల చర్యలు
గతంలో కట్టపై రియల్ ఎస్టేట్‌కు దారి కోసం కట్టను తవ్వినా ఇరిగేషన్ అధికారులు పెద్దగా స్పందించలేదు. దాన్ని ఆర్‌అండ్‌బీ వారు చూసుకుంటారని పట్టించుకోలేదు. కట్టకు ఇరువైపులా పెద్ద భవన నిర్మాణాలు చేపడుతున్నా అది వారి పట్టా భూమిలేనని వదిలేశారు. ఇప్పుడు ఏకంగా నడికట్టపై జేసీబీతో తవ్వుతున్నా అడిగేవాళ్లే లేకుండా పోయారు. అధికారుల తీరుపై పట్టణవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కట్టపై జేసీబీతో తవ్వినా పట్టించుకోరా?
ఇప్పటికే పెద్ద చెరువు కట్ట ఆక్రమణలకు గురైంది. ఇప్పుడు చెరువు నిండి మొరవపోతోంది. నిండు కుండలా ఉన్న చెరువు నడి కట్టపై జేసీబీతో తవ్వుతుంటే కడుపు మండి కమిషనర్, ఏఈ, ఇరిగేషన్ అధికారులకు ఫోన్ చేస్తే ఎవరూ స్పందించలేదు. ఇరిగేషన్ ఏఈ వచ్చి జేసీబీని వెనక్కు పంపారే గాని ఆక్రమణకు కారణమైన వారిపై చర్యలు తీసుకోలేదు.
– కావడి నాగరాజు, కౌన్సిలర్, పలమనేరు
పెద్ద చెరువును కాపాడుకోవాలి
నేను ఇక్కడే పుట్టి పెరిగా, పట్టణానికి పెద్ద చెరువుకు విడదీయరాని సంబంధం ఉంది. అలాంటి పెద్ద చెరువు కట్ట, చెరువును కాపాడుకోవాల్సిన అవసరం పట్టణవాసులుగా అందరిపై ఉంది. ఈ సమస్యపై పీపీఎస్‌లాంటి వారు ముందుకు రావాలి. అక్రమార్కుల దెబ్బకు చెరువు నాశనం అవుతుంటే అధికారులు పట్టించుకోకపోవడం బాధగా ఉంది.
– పుష్పరాజ్, రిటైర్డ్ టీచర్, పలమనేరు
ఆగని ఆక్రమణలు
ఆగని ఆక్రమణలు


