భానుప్రకాష్ రెడ్డికి భావోద్వేగం ఎందుకో?
గత పాలక మండలిలో బీజేపీ నేతలు ఎందుకు ప్రశ్నించలేదు మీపై ఒత్తిడి తెస్తున్నది మీ పార్టీ నేతలా.. బయటి వారా? జర్నలిస్టు శ్రీనివాసులు ఆరోపణపై సమాధానమివ్వండి సీపీఎం నేత కందారపు మురళి డిమాండ్
తిరుపతి కల్చరల్: టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి భావోద్వేగంతో తాను ఉంటానో, పోతానో తెలియదని మీడియా సమావేశంలో మాట్లాడడంపై పలు అనుమానాలున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కందారపు మురళి అన్నారు. స్థానిక సీపీఎం కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పరకామణి వ్యవహారంపై ఏపీ హైకోర్టు స్పందించిన తీరును తాము స్వాగతిస్తున్నామన్నారు. ప్రస్తుత టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి భావోద్వేగంతో తాను ఉంటానో, పోతానో తెలియదని.. తనపై తీవ్ర ఒత్తిడి ఉందని మీడియా సమావేశంలో మాట్లాడారని గుర్తుచేశారు. దీనిపై భక్తుల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. గత పాలక మండలిలో బీజేపీ నేతలు ఉన్న నాడు ప్రశ్నించక మిన్నకుండిపోవడం తప్పు కాదా? అని ప్రశ్నించారు. బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డిపై ఒత్తిడి తెస్తున్నది తన సొంత పార్టీ నేతలా? బయటివారా? ఎవరన్న విషయాన్ని వెల్లడించకుండా భావోద్వేగానికి గురైతే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. నిందితుడి భార్య డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేశారని జర్నలిస్టు శ్రీనివాసులు చేస్తున్న ఆరోపణపై భానుప్రకాష్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పరకామణిలో జరుగుతున్న అవకతవకలపై సమగ్ర నివేదికను తీసుకురావాలని, పరకామణిలో చిన్న జియ్యంగార్ మఠం పాత్రపై లోతైన విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. 35 ఏళ్లుగా ఒకే వ్యక్తి పరకామణిలో పర్యవేక్షణకు ఎలా వెళతారని క్లర్క్ స్థాయి కూడా లేని రవికుమార్‌కు రూ.వందల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో భక్తులకు వెల్లడించాలని, ఈ కోణంలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఎం నేతలు టి.సుబ్రమణ్యం, ఎస్.జయచంద్ర, పి.సాయిలక్ష్మి, మాధవ్, లక్ష్మి, జయంతి, వేణుగోపాల్, ముజీ పాల్గొన్నారు.


