
అధిక వర్షాలకు అప్రమత్తంగా ఉండండి
● సహాయక చర్యలకు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
● సహాయం, ఫిర్యాదులకు 9491077325, 08572–242777 నంబర్
● కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ
చిత్తూరు కలెక్టరేట్ : అధిక వర్షాలకు ఎలాంటి నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో పలు శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వరుస అల్పపీడనాలతో జిల్లాలో అధిక వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించిందన్నారు. అధిక వర్షాలతో క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎటువంటి నష్టం కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. జిల్లాలోని రోడ్లు, కల్వర్టులు వాటి పటిష్టతపై రిపోర్టు ఇవ్వాలన్నారు. ఎలాంటి నష్టం జరకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ శాఖకు సంబంధించి విద్యుత్ స్తంభాలు, వైర్లు తదితర వాటిపై సమీక్షించుకోవాలన్నారు. డీపీఓ గ్రామ పంచాయతీల పరిధిలో ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. పాత ఇళ్లను గుర్తించి ప్రత్యామ్నాయం చూపాలన్నారు. వ్యవసాయ శాఖ పంటలపై నివేదికలు తయారు చేయాలన్నారు. ఎరువులు, యూరియా అందుబాటులో ఉంచుకోవాలన్నారు.
సీజనల్ వ్యాధులపై అప్రమత్తత అవసరం
జిల్లాలో అధిక వర్షాలకు సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశాలు ఉంటాయని, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అన్నారు. అధిక వర్షాలకు నీరు నిల్వ చేరడం, పరిసరాల పరిశుభ్రత లోపించడం, తాగునీరు కలుషితంతో వివిధ రకాల వ్యాధులు వ్యాపించే ప్రమాదాలు ఉంటాయన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పంచాయతీ, మున్సిపల్, నగరపాలక శాఖ అధికారులు సమన్వయంతో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. కీటక జనిత వ్యాధులు, అంటువ్యాధులకు సంబంధించిన అన్ని రకాల మందులు, వ్యాధి నిర్ధారణ కిట్లు అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో అందుబాటులో ఉంచుకోవాలన్నారు. దోమల వ్యాప్తిని తగ్గించడానికి ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కలుషిత నీటి నివారణ కోసం క్లోరినేషన్ చేసిన లేదా కాల్చి చల్లార్చిన నీటిని తాగాలని సూచించారు. అపరిశుభ్ర ఆహారాన్ని తీసుకోకూడదన్నారు. ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే వెంటనే సమీపంలోని ప్రభుత్వాస్పత్రిలో సంప్రదించాలన్నారు. జిల్లాలో అధిక వర్షాలకు వాగులు, వంకలు, చెరువుల్లో అధికంగా నీరు చేరాయని, పిల్లలు వాటి వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు వహించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అటవీశాఖ అధికారి సుబ్బురాజు, డ్వామా పీడీ రవికుమార్, డీఈఓ వరలక్ష్మి పాల్గొన్నారు.
అధిక వర్షాలకు క్షేత్రస్థాయిలో ప్రజలకు ఏవైనా సమస్యలు తలెత్తితే తెలియజేసేందుకు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 26 వ తేదీ వరకు అధిక వర్షాలు కురస్తాయని వాతావారణ శాఖ వెల్లడించింది. దీంతో కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ 24 గంటల పాటు పనిచేసేలా చర్యలు చేపట్టారు. రెండు షిప్టుల్లో ప్రత్యేక సిబ్బంది విధులు నిర్వహించేలా బాధ్యతలు అప్పగించారు. అధిక వర్షాలకు ప్రజలకు ఎటువంటి సమస్య తలెత్తినా, సహాయం కోసమైనా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 9491077325, 08572–242777కు కాల్ చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు.
సమస్యలు,
సహాయానికి
కాల్ చేయండి