
జాగ్రత్తగా ఉండండి
పుంగనూరు: భారీ వర్షాల్లో చిక్కుకుని, ఇబ్బందులు పడకుండా జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యమైన పనులు ఉంటే మినహా బయటకు వెళ్లవద్దని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజలకు సూచించారు. బుధవారం ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. ముఖ్యంగా రైతులు పొలం పనులకు వెళ్లవద్దని, ఒక వేళ వెళితే ఆ ప్రాంతంలో విద్యుత్ వైర్లు పడి ఉన్నాయా? లేదా అన్న విషయాన్ని, షార్ట్ సర్క్యూట్‌ను పరిశీలించి పనులు చేయాలన్నారు. చిన్నపిల్లలను చెరువులు, కుంటలు, వాగుల వద్దకు పంపకుండా నియంత్రించాలన్నారు. ప్రస్తుతం మంచినీరు కలుషితమయ్యే అవకాశం ఉందన్నారు. నీటిని ప్రతి ఒక్కరూ వేడిచేసి, వాటిని తాగడం సురక్షితమని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తమకు సమాచారం అందించాలని కోరారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా పార్టీ నాయకులు, కార్యకర్తలు సహాయక చర్యల్లో పాల్గొని, సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.