పుంగనూరు ‘గో రక్షిత రక్షితః’ | - | Sakshi
Sakshi News home page

పుంగనూరు ‘గో రక్షిత రక్షితః’

Oct 23 2025 6:15 AM | Updated on Oct 23 2025 6:15 AM

పుంగనూరు ‘గో రక్షిత రక్షితః’

పుంగనూరు ‘గో రక్షిత రక్షితః’

పుంగనూరు జాతి పొట్టి పశువుల పెంపే లక్ష్యం! ’ఐవీఎఫ్‌ విధానంతో మరింత పెరగనున్న పుంగనూరు జాతి ’500 పుంగనూరు రకం పశువుల పెంపే లక్ష్యం

చిట్టి ఆవు.. చూడ చక్కని దూడ.. శుభానికి సంకేతం. భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో విశిష్టస్థానం పొందిన అమూల్య సంపద ఆవు. గోమాతగా ఖ్యాతిగాంచిన కామధేనువైన పుంగనూరు పొట్టి ఆవుకు..ప్రస్తుత యాంత్రిక యుగంలో కష్టకాలం వచ్చింది. ఇలాంటి కాలంలోనూ ఆ పశుపరిశోధన స్థానం అంతరించి పోతున్న చిట్టి ఆవుల పునరుత్పత్తికి నడుం కట్టింది. ప్రభుత్వాల సాయంతో పుంగనూరు జాతి పశువుల పరిరక్షణే ధ్యేయంగా ముందుకు సాగుతోంది.

పలమనేరు: ప్రపంచంలోనే అరుదైన రకం పశువులుగా పుంగనూరు పొట్టి ఆవులకు పేరుంది. వీటి ఉనికి ప్రశ్నార్థకంగా మారుతున్న నేపథ్యంలో వీటిని సంతతిని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఆర్‌కేవీవై ద్వారా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ నిధుల ద్వారా పలమనేరు పశు పరిశోధన కేంద్రంలో ఐవీఎఫ్‌ ల్యాబ్‌ను గత ప్రభుత్వంలోనే ఏర్పాటు చేశారు. దీనిద్వారా కృత్రిమ పిండోత్పత్తి ద్వారా పుంగనూరు జాతి పశువులను ఎక్కువగా ఉత్పత్తి చేసే అవకాశం ఏర్పడింది.

పరిశోధన కేంద్రం లక్ష్యం ఇదీ

పలమనేరు సమీపంలోని కేటిల్‌ఫామ్‌ వద్ద 1953లో సంకర జాతి ఆవుల ఉత్పత్తి, పరిశోధనా కేంద్రంగా ప్రారంభమైన ఈ పశు పరిశోధన సంస్థ 1995 నుంచి పుంగనూరు పొట్టి రకం ఆవుల ఉత్పత్తి కేంద్రంగా మారింది. ఇన్‌సైటీవ్‌ కన్సర్వేషన్‌ (స్థానికంగా వీటి సంఖ్యను ఉత్పత్తి చేయడం) దీని లక్ష్యం. 20 పొట్టి రకం పశువులతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు 300కు పైగా పశువులు వరకు పెంచింది. అయితే నూతన సాంకేతిక పద్ధతుల ద్వారా వీటి సంఖ్యను మరింత పెంచాలని ప్రభుత్వం సంకల్పించింది. దీంతో స్థానిక పరిశోధనా కేంద్రంలో ఆర్‌కేవీవై, ఐకార్‌ నిధులతో రూ.2.85 కోట్లతో పిండమార్పిడి కేంద్రాన్ని (ఎంబ్రయో ట్రాన్స్‌ఫర్‌ ల్యాబ్‌), ఐవీఎఫ్‌( ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌)ల్యాబ్‌ను గతంలో ఏర్పాటు చేశారు.

పిండమార్పిడి పద్ధతిలో అధిక ఉత్పత్తి

గతంలో పుంగనూరు జాతి ఎద్దు నుంచి వీర్యం తీసి ఎదకొచ్చిన ఆవుకు ఇచ్చేవారు. దీంతో ఆవుకు ఓ దూడ మాత్రమే పుట్టేది. అయితే ఐవీఎఫ్‌ ద్వారా ఎద్దు వీర్యం నుంచి ఎక్కువ అండాలను తీసుకుని ఎక్కువ ఆవులకు ఇస్తారు. సరోగసి పద్ధతిలో ఎదకొచ్చిన ఎక్కువ ఆవులకు ఇంప్లాంట్‌ చేస్తారు. దీంతో ఒకే ఏడాదిలో ఈ జాతి పశువులను ఎక్కువ ఉత్పత్తి చేసేందుకు వీలవుతుంది. ఈ విధానం ద్వారా ఏటా వందల సంఖ్యలో పొట్టి రకం పశువుల ఉత్పత్తి జరగనుంది. దేశంలో 34 రకాల పశు జాతులున్నాయి. వీటిల్లో అత్యంత ముఖ్యమైంది పుంగనూరు పొట్టి రకం పశువులే. ఇవి స్థానిక పశు పరిశోధనా కేంద్రంలో తొలుత 200 ఉండగా వీటి సంఖ్య ఇప్పుడు 300కు పైగా చేరింది. ఇప్పుడు ఐవీఎఫ్‌ ద్వారా వచ్చే ఐదేళ్లల్లో వీటి సంఖ్యను 500కు పెంచే లక్ష్యంతో పశుపరిశోధన కేంద్రం కృషి చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement