
ఉపాధి లెక్క.. అక్రమాలు పక్కా
కేంద్ర ప్రభుత్వం ఉన్నతాశయంతో అమలు చేసిన ఉపాధి హామీ పథకం పుంగనూరు నియోజకవర్గంలో నాయకులకు ఉపాధి కల్పిస్తోంది. అవినీతి కట్టడి చేయాల్సిన అధికారులు కూటమి నేతల అవినీతిని పెంచి పోషిస్తున్నారు. దీంతో ఉపాధి హామీ పథకంలో అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. నిధులు నిరుపయోగం అవుతున్నాయి. కూలీలకు ఆకలి కేకలు మిగులుతున్నాయి.
సాక్షి టాస్క్‌ఫోర్స్: పుంగనూరు నియోజకవర్గంలో ఉపాధిహామీ పథకంలో పలు అక్రమాలు జరిగాయి. వీటిపై విజిలెన్స్ విచారణ కోసం బుధవారం స్థానిక జెడ్పీ గెస్ట్‌హౌస్‌కు 28 మందితో కూడిన విజిలెన్స్ బృందం చేరుకుంది. నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన పీఓలు , ఏపీడీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లతోపాటు సంబంధిత ఉద్యోగులను సీనియర్ క్వాలిటి కంట్రోల్ ఆఫీసర్ శాంతారామ్ ఆధ్వర్యంలో రికార్డుల పరిశీలన మండలాల వారీగా నిర్వహించారు. విషయం తెలుసుకుని మీడియా వెళ్లడంతో ఆయన మీడియా నాట్ అలౌడ్ అని, ఇందుకు సంబంధించి ఏదైనా సమాచారం రాష్ట్ర అధికారులు తెలుపుతారని మీడియాను అనుమతించలేదు. కాగా పుంగనూరు నియోజకవర్గంలో కూటమి నేతలు కూలీల పేరిట ఉపాధి పనులు యంత్రాలతో చేసి, దొంగ బిల్లులు పెట్టి, రూ.కోట్లు దోచుకున్నారని, కూలీల కడుపు కొట్టారని, వీటిపై విజిలెన్స్‌శాఖతో విచారణ జరిపించాలని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాన్ని విచారణ జరిపి నివేదికలు పంపాల్సిందిగా ఆదేశించింది. ఈ మేరకు ఈనెల 23 వరకు విజిలెన్స్ కమిటీ ఆరు మండలాల్లో పర్యటించి, అక్రమాలను గుర్తించి, నివేదికలు సిద్ధం చేయాల్సి ఉంది.
రహస్యమే...
విజిలెన్స్ అధికారులు గుట్టు చప్పుడు కాకుండా ఆయా మండలాల్లో సిబ్బందితో రికార్డులు పరిశీలించాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా పుంగనూరు జెడ్పీ గెస్ట్‌హౌస్‌లో అందరిని పిలిపించి, రికార్డులు పరిశీలించడం సర్వత్రా అనుమానాలకు దారి తీస్తోంది. అక్రమాలపై గ్రామాల్లో పర్యటించి విచారణ జరిపితే వాస్తవాలు వెలుగు చూస్తాయని, నాలుగు గోడల మధ్య ఎలా వాస్తవాలు బయటకు వస్తాయని పలువురు ప్రశ్నిస్తున్నారు. మూడు రోజుల పర్యటనలో ఒక రోజు విశ్రాంతి భవనంలో సరిపోయింది. ఇక మిగిలిన రెండు రోజుల్లో 6 మండలాల్లో పర్యటించాల్సి ఉంది. వర్షం వస్తే ఇక విచారణ సంగతి దేవుడికెరుక.