
50 శాతం పచ్చదనాన్ని సాధించాలి
చిత్తూరు కలెక్టరేట్ : మిషన్ హరిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో జిల్లాలో 2047 నాటికి 50 శాతం పచ్చదనాన్ని సాధించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. ఆయన బుధవారం కలెక్టరేట్‌లో అటవీశాఖతోపాటు పలు శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో పచ్చదనం పెంపొందించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వన మహోత్సవం కార్యక్రమాలను జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో పటిష్టంగా అమలుచేయాలని సూచించారు. తక్కువ సాంధ్రత ఉన్న మండలాల్లో మూల నిల్వలను సంరక్షించేందుకు మిశ్రమ విధానాన్ని అమలు చేయాలన్నారు. వ్యవసాయ, వ్యవసాయేతర, ప్రైవేట్, రోడ్ల పక్కన, విద్యాసంస్థల్లో విరివిగా మొక్కలు నాటించాలని పేర్కొన్నారు. జిల్లా అటవీశాఖ అధికారి సుబ్బురాజు మాట్లాడుతూ పిల్లలు విద్యార్థి దశ నుంచే మొక్కల పెంపకంపై మక్కువ చూపించేలా అవగాహన కల్పించాలన్నారు. వనం మనం, వన మహోత్సవం, ప్రకృతి పిలుస్తోంది, కార్తీక వన సమారాధన, మిషన్ హరిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలను పటిష్టంగా నిర్వహిస్తున్నమని తెలిపారు. కార్యక్రమంలో డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ జ్ఞానప్రకాష్‌రాజు, జెడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు, డీఆర్‌డీఏ పీడీ శ్రీదేవి, డ్వామా పీడీ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.