
వంచనగురూ!
మూడు నెలలుగా పిల్లలపై లైంగిక వేధింపులా? చదువుపై శ్రద్ధ చూపని కొందరు ఉపాధ్యాయులు రియల్, చీటీల వ్యాపారాల్లో తలమునకలు విస్తుపోతున్న తల్లిదండ్రులు
తల్లిదండ్రుల తర్వాత గురువుకే పెద్దపీట వేసిన సమాజం మనది. గురువులను సమాజనిర్దేశకులంటారు. ఎక్కడైతే మంచి గురువు ఉంటాడో అక్కడి విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. గతంలో ఉన్న గురువులు ఎంతో నిజాయితీతో పనిచేసేవారు. అందుకే వారికి ఇప్పటికీ సమాజంలో ప్రత్యేక గౌరవం ఉంది. కానీ ఈ మధ్య కాలంలో కొందరు టీచర్ల తీరు మొత్తం ఉపాధ్యాయ వ్యవస్థకే మాయని మచ్చని తెచ్చిపెడుతోంది. ఎలాగూ సర్కారు కొలువు.. నెలకి మంచి జీతం.. పిల్లలు ఎలా పోతే మాకేంటి.. మా పిల్లలు కార్పొరేట్ బడుల్లో చదువుకుంటున్నారనే భావన, వృత్తిపై నిర్లక్ష్యాన్ని, వికృత చేష్టల వైపు ఉసిగొల్పుతోంది. ఇంతకీ ఆ గురువంచన ఏందో మీరే చదవండి..!
పలమనేరు: నియోజకవర్గంలోని బైరెడ్డిపల్లి మండలం, దేవదొడ్డి ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఓ టీచర్ (45) బడిలోని పిల్లలపై అసభ్యకరంగా ప్రవర్తించడం, తాకరానిచోట తాకడం, ఎవరైనా చెప్పారంటే తాటతీస్తానంటూ బెదిరించడం అలవాటుగా చేసుకున్నారు. తాజాగా శుక్రవారం ఆ బడి పిల్లలే ఆ విషయాలు చెప్పడంతో వెలుగుచూసింది. గ్రామస్తులంతా ఏకమై ఆ పంతులు గారికి దేహశుద్ధి చేశారు. ఇలాంటి కీచక గురువుల కారణంగా నిజాయితీగా పనిచేసే గురువులకు సమాజంలో గుర్తింపులేకుండా పోతోంది.
ఎంతసేపూ సంపాదనే
పలమనేరు నియోజకవర్గంలోని కొందరు టీచర్లు గత కొన్నేళ్లుగా రియల్ ఎస్టేట్‌లో స్లీపింగ్ పార్ట్‌నర్లుగా ఉండేవారు. కానీ ఈ మధ్య వారే రంగంలోకి దిగి వెంచర్లు వేయడం, ప్లాట్లను అమ్మడం లాంటి కార్యక్రమాల్లో బిజీగా కనిపిస్తున్నారు. వీరితోపాటు ఎందరో టీచర్లను ఇందులోకి చేర్చి వారికి సైట్లను అమ్మడం లేదా వారిని భాగస్వాములుగా చేసుకోవడం లాంటివి చేస్తున్నారు.
నెలవారీ చీటీల గోల
మరికొందరు టీచర్లు నెలవారీ చీటీలు, ఫైనాన్స్ వ్యాపారాల్లో తలమునకలైపోయారు. వీరికి బడితో పనిలేదు. కేవలం నెలవారీ చీటీలు, కొత్త సభ్యులు, చీటీల సొమ్ము వసూలు చూసుకుంటూ ఎప్పుడో తూతూమంత్రంగా విధులు నిర్వహించడం పరిపాటిగా మారింది. మహిళా టీచర్లు సైతం చీరల వ్యాపారాలు, చైన్‌లింగ్ వ్యాపారాలు, సన్నబడే మందులు, టానిక్‌ల వ్యాపారాల్లో మునిగితేలుతున్నారు. అదనపు సంపాదనపై చూపుతున్న శ్రద్ధ పిల్లల చదువు పట్ల లేదనే మాట సర్వత్రా వినిపిస్తోంది. నీతిగా, నిజాయితీగా పిల్లల భవిష్యత్తే ధ్యేయంగా పనిచేస్తున్న గురువులకు ఇలాంటి వారి కారణంగా సమాజంలో మర్యాదలేకుండా పోతోంది.
ఉపాధ్యాయ వృత్తికే కళంకం
దేవదొడ్డి ఘటనతో చాలాబాధపడ్డాను. ఇలాంటి గురువుల ప్రవర్తక కారణంగా మొత్తం వ్యవస్థపైనే చెడు భావం కలుగుతుంది. మంచి సమాజాన్ని నిర్మించాల్సిన గురుతర బాధ్యత గురువులపై ఉంది. కానీ కొందరి కారణంగా సమాజంలో టీచర్లు తలెత్తుకోలేకుండా చేస్తున్నారు. – సోమచంద్రారెడ్డి,
మాజీ యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు
ఆ నమ్మకం నిలబెట్టుకోవాలి
మా బిడ్డలను మీ పిల్లలుగా చూసుకుంటారనే నమ్మకంతో బడికి పంపుతాం. కానీ టీచర్లే ఇలా కీచకులుగా మారి వికృతంగా ప్రవర్తిస్తే వీరినేమనాలి. ఇలాంటి టీచర్ల కారణంగా అందరూ టీచర్లకు చెడ్డపేరు ఎందుకు రాదు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
– ఈశ్వర, పేరెంట్, దేవదొడ్డి గ్రామం

వంచనగురూ!

వంచనగురూ!

వంచనగురూ!