
వ్యక్తి ఆత్మహత్య!
పలమనేరు: మండలంలోని కాలువపల్లి కౌండిన్య జలాశయంలో గుర్తుతెలియని 40 ఏళ్లకు పైనున్న ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం వెలుగుచూసింది. నీటిపై తేలిన శవాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడు బట్ట తల, గడ్డం కలిగి, మంచి దుస్తులు ధరించి, ఖరీదైన వాచ్, వేళ్లకు ఉంగరాలు పెట్టుకుని ఉన్నాడు. మెడలో కరుగంళిమాలను సైతం ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని గమనించిన స్థానికులు తమిళనాడుకు చెందిన వ్యక్తిగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇతనికి సంబంధించిన వివరాలు తెలిస్తే స్థానిక స్టేషన్‌లో సంప్రదించాలని ఇక్కడి పోలీసులు తెలిపారు.
ఇద్దరు దొంగలు అరెస్టు
ఏడు బైకుల స్వాధీనం
చిత్తూరు అర్బన్: ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న జయకుమార్ (26), లోకనాథన్ (18) అనే ఇద్దరు నిందితులను చిత్తూరు పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి దాదాపు రూ.3.5 లక్షల విలువ చేసే ఏడు మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం చిత్తూరులోని టూటౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో సీఐలు మహేశ్వర, నెట్టింకంటయ్య కలిసి వివరాలను మీడియాకు వెల్లడించారు. ఇటీవల నగరంలో మోటారు సైకిళ్లు వరుసగా చోరీకి గురయ్యాయని, బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించినట్టు వెల్లడించారు. చిత్తూరు–వేలూరు రోడ్డులో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు తమిళనాడులోని వేలూరుకు చెందిన జయకుమార్, లోకనాథన్ ఇద్దరు అనుమానితులు కనిపించారని తెలిపారు. వీళ్లను విచారించగా మోటారు సైకిళ్లను చోరీ చేసినట్లు అంగీకరించినట్టు వెల్లడించారు. నిందితులు దాచి ఉంచిన ఏడు మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. పారిపోయిన సయ్యద్ నస్రుల్లా అనే నిందితుడి కోసం గాలిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ఎస్‌ఐ రమేష్ బాబు, సిబ్బంది బాబు, నరేష్, మునస్వామి, రఫుల్లా పాల్గొన్నారు.
అది దుర్మార్గం
పాలసముద్రం : గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలను తీసుకొస్తే.. కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటు పరం చేయాలనుకోవడం దుర్మార్గమని జీడీ నెల్లూరు సమన్వయకర్త కృపాలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జగనన్న హయాంలో 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకొచ్చి, రూ 8,450 కోట్లతో పూర్తిచేయాలని సంకల్పించారని, ఇందులో భాగంగానే మొదటి దశలో ఐదు మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయని గుర్తుచేశారు. ఎన్నికల ముందు మరో మూడు కాలేజీలు పూర్త య్యాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం కమీషన్ల కోసమే ప్రయివేటు పరం చేస్తోందన్నారు.