అడ్మిషన్లు ఒక చోట... హాజరు మరోచోట | - | Sakshi
Sakshi News home page

అడ్మిషన్లు ఒక చోట... హాజరు మరోచోట

Sep 13 2025 4:23 AM | Updated on Sep 13 2025 4:23 AM

అడ్మి

అడ్మిషన్లు ఒక చోట... హాజరు మరోచోట

ఇష్ణానుసారంగా ప్రైవేట్‌ ఇంటర్మీడియెట్‌ కళాశాలలు విద్యార్థులను మోసం చేస్తున్న పలు యాజమాన్యాలు ప్రతి విద్యాసంవత్సరంలోనూ ఇదే తంతు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్న అధికారులు

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలోని ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల యాజమాన్యాలు పలు అక్రమాలకు తెరలేపుతున్నారు. తప్పుడు ప్రచారాలతో అడ్మిషన్లు చేసుకుని విద్యార్థులను ముప్పుతిప్పలకు గురిచేస్తున్నారు. కొందరు పేరొందిన కళాశాలల కంటే తాము 30 నుంచి 40 శాతం వరకు తక్కువ ఫీజుతో బోధన అందిస్తామని, ఐఐటీ, జేఈఈ, నీట్‌ క్లాసులను ప్రత్యేకంగా నిర్వహిస్తామని మాయమాటలతో అడ్మిషన్లు చేసుకుంటున్నారు. ఆ తర్వాత మోసాలకు పాల్పడుతున్నారు. ఆ కళాశాలల్లో అడ్మిషన్‌లు పొందుతున్న విద్యార్థుల నామినల్‌ రోల్స్‌ను ఇతర కళాశాలలకు పంపడం, పాస్‌ అయిన తర్వాత టీసీలు, బోనఫైడ్‌ సర్టిఫికెట్‌లను మరొక కళాశాల నుంచి ఇప్పించడం వంటివి చేస్తున్నారు. అడ్మిషన్‌ల సమయంలో ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పకుండా మోసం చేస్తున్నారు. ఇలాంటి అవకతవకల వల్ల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తక్కువ ఫీజులు అని అడ్మిషన్‌ల సమయంలో చెప్పి చేర్పించిన తర్వాత అధిక ఫీజులు వసూలు చేయడంతో పాటు మరొక చోట పిల్లల సర్టిఫికెట్‌లు ఇస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

చిత్తూరు నగరంలోని మురుగానపల్లిలో ఉన్న ఓ ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలో అధిక సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు. ఇంటర్మీడియెట్‌ బోర్డు నిబంధనలకు మించి ఆ కళాశాలలో విద్యార్థులు ఉండడంతో అడ్మిషన్‌లు అక్కడే చేయించుకుని, అటెండెన్స్‌ మరొకచోట వేస్తున్నారు. ప్రతి విద్యాసంవత్సరం ఇదే తంతు కొనసాగుతోంది.

చిత్తూరు నగరంలోని మురుగానపల్లిలో ఉండే మరో ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాల యాజమాన్యం ఏకంగా అడ్మిషన్‌లు, ఫీజులు ఆ కళాశాలలో చేయించుకుంటూ ఉత్తమ ర్యాంకుల కోసం సమీప మండలాల్లోని మరో ప్రైవేట్‌ కళాశాలల్లో చదువుతున్నట్లు రికార్డుల్లో రాయిస్తున్నారు. పబ్లిక్‌ పరీక్షల సమయంలో సమీప మండలంలో ఒకే పరీక్ష కేంద్రం ఉండడం వల్ల మాల్‌ ప్రాక్టీస్‌కు ఎక్కువ అవకాశాలుంటాయని వారి భావన.

విద్యాశాఖ విఫలం

జిల్లాలో ఇంటర్మీడియెట్‌ విద్యాశాఖ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేయడంలో విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. ఇంటర్మీడియెట్‌ అధికారులు ప్రైవేట్‌ కళాశాలల్లో తనిఖీలు చేయాలన్న నిబంధనలు ఉన్నప్పటికీ ఆ వైపు కన్నెత్తి చూడడం లేదు. ఒక వేళ కొన్ని కళాశాలలకు వెళ్లినా పరిసర ప్రాంతాలను పరిశీలించి... చాయ్‌ బిస్కెట్‌ తినేసి వచ్చేస్తున్నారనే విమర్శలున్నాయి. నిబంధనల ప్రకారం ప్రైవేట్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఎంత మంది ? అడ్మిషన్‌ రిజిస్టర్‌లు రాస్తున్నారా? సరైన రికార్డులు అమలు చేస్తున్నారా ? పలు విషయాలను తనిఖీ చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

పట్టించుకుంటే ఒట్టు

జిల్లాలో చిత్తూరు, పలమనేరు, కుప్పం, పుంగనూరు, నగరిలో ఉండే పలు ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలు ఇష్టానుసారంగా విద్యార్థులను అడ్మిషన్‌ చేసుకున్నాయి. దీనిపై సంబంధిత జిల్లా అధికారులకు పలు మార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఫిర్యాదులున్న కళాశాలలను వదిలేసి ఫిర్యాదులు లేని కళాశాలలను తనిఖీ చేస్తున్నారు. అధిక సంఖ్యలో అడ్మిషన్‌లు చేయించుకున్న కళాశాలల వైపు కన్నెత్తి చూడడం లేదు. – ప్రవీణ్‌, ఏఐఎస్‌ఎఫ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి, చిత్తూరు జిల్లా

అడ్మిషన్లు ఒక చోట... హాజరు మరోచోట 1
1/2

అడ్మిషన్లు ఒక చోట... హాజరు మరోచోట

అడ్మిషన్లు ఒక చోట... హాజరు మరోచోట 2
2/2

అడ్మిషన్లు ఒక చోట... హాజరు మరోచోట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement