
అవినీతి ఆరోపణలు
తొమ్మిది నెలల్లో ఇద్దరు సీఎంఎంలు సరెండర్ అధికారులపై ఒత్తిడి పెంచుతున్న కూటమి నేతలు బ్యాంకు రుణాల మంజూరుకు తప్పని కమీషన్లు వివాదాస్పదమవుతున్న కొందరు ఆర్పీల వ్యవహారం చిత్తూరు కార్పొరేషన్‌లో గాడి తప్పుతున్న మెప్మా
అంతర్గత కుమ్ములాటలు.. సమన్వయ లోపం.. కూటమి నేతల పెత్తనం వెరసి చిత్తూరు కార్పొరేషన్ పరిధిలోని మెప్మా పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఇక్కడ పనిచేయాలంటేనే అధికారులు, సిబ్బంది వణికిపోవాల్సి వస్తోంది. తొమ్మిది నెలల్లోనే ఇద్దరు సీఎంఎంలను సరెండర్ చేయడం ఇక్కడి వేధింపులకు నిదర్శనంగా మారింది.
చిత్తూరు అర్బన్: చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్‌లోని పట్టణ దారిద్య్ర నిర్మూలనా విభాగం అంటే కాస్త అర్థం కాకపోవచ్చు. మెప్మా విభాగమంటే తెలియని వాళ్లు ఉండరు. గత తొమ్మిది నెలల కాలంలో ఇద్దరు సిటీ మిషన్ మేనేజర్ (సీఎంఎం)లను సరెండర్ చేయడం చర్చనీయాంశమవుతోంది.
జన సమీకరణ ఒత్తిడి
ప్రభుత్వ కార్యక్రమాలు, అధికారిక కార్యక్రమాలకు మహిళా సంఘాలను తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. అయితే కొందరు ఆర్పీలు జన సమీకరణ సమయాల్లో మహిళా సంఘాలను ఫోన్లలో బెదిరింపులకు గురిచేయడం, సంక్షేమ పథకాలు ఇవ్వమని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొన్ని సభలకు పది వేల మంది రావాలని, ఇంకొన్ని సార్లు 15 వేల మంది రావాలంటూ కూటమి నేతలు మెప్మా సీఎంఎంలపై ఒత్తిడి పెంచుతున్నారనే విమర్శలున్నాయి. ఆశించిన స్థాయిలో మహిళలు హాజరుకాకపోవడంతో అధికారులపై ఫైర్ అవుతుండడంతో కొందరు సెలవు పెట్టి వెళ్లిపోతున్నారు. మరికొందరిని సరెండర్ చేస్తున్నారు. ఒక్కసారి సీఎంఎం బదిలీపై వస్తే దాదాపు మూడేళ్లకు పైనే పనిచేస్తారు. కానీ ఇక్కడ మాత్రం తొమ్మిది నెలల్లో ఇద్దరు సీఎంఎంలు బదిలీ అవడం పరిస్థితిని అంచనా వేయొచ్చు. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఏ అధికారి ఇక్కడ పనిచేయడానికి వచ్చే అవకాశం ఉండదు.
ఎవరిదారి వారిది?
చిత్తూరు కార్పొరేషన్‌లో 3,340 వరకు మహిళా సంఘాలు మెప్మా పరిధిలో ఉన్నాయి. 34 వేల మందికి పైగా మహిళలు ఇందులో సభ్యులుగా ఉన్నారు. వీళ్లను పర్యవేక్షించడానికి 111 మంది రిసోర్సు పర్సన్లు, పది మంది కమ్యూనిటీ ఆర్గనైజర్లు, 111 ఎస్‌ఎల్‌ఎఫ్‌లు ఉన్నాయి. వీళ్లందరి పర్యవేక్షణ సీఎంఎం చూసుకోవాలి. కానీ ఇక్కడ ఒకరికి మరొకరికి సమన్వయం ఉండడంలేదు. ఆర్‌పీలపై సీఎంఎం ఒత్తిడి చేయడం, ఎస్‌ఎల్‌ఎఫ్‌లు తమ గుప్పెట్లో ఉండాలని తాపత్రయపడడం అంతర్గత కుమ్ములాటకు ఆజ్యం పోస్తోంది. గతంలో పనిచేసిన అధికారుల ఏం అవినీతి చేశారు..? ఎందులో ఎవరిని ఇరికిద్దామని గూఢచార్యం చేయడం మెప్మా విభాగంలో సర్వసాధారణమైపోయింది.
మహిళా సంఘాలకు ప్రధానంగా బ్యాంకు రుణాలు ఇప్పించి, వారి ఆర్థిక స్థితి గతులను మార్చడమే మెప్మా లక్ష్యం. కానీ కొందరు మహిళలు వారికున్న వాక్చాతుర్యాన్ని ప్రదర్శించి బ్యాంకు రుణాలు ఇప్పించి కమీషన్లు దండుకుంటున్నారు. వీటికి తోడు అనధికారింగా రూ.లక్షల విలువ చేసే చీటీలు వేయడం, అందులో మహిళా సంఘ సభ్యులు చేరాల్సిందేనంటూ తప్పనిసరి చేస్తున్నారు. తీరా చీటీలు ఎత్తిన తరువాత డబ్బు ఇవ్వకుంటే పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు. ఇంకొందరు ఏకంగా మీడియా సమావేశాలు నిర్వహించి అధికారులు అసభ్య ప్రవర్తనపై బహిరంగంగానే దుమ్మెత్తి పోస్తున్నారు. గాడి తప్పిన మెప్మా విభాగాన్ని సరిదిద్దడానికి ఇటు కమిషనర్, అటు అర్బన్ పీడీ దృష్టి సారిస్తే తప్ప.. సమస్య పరిష్కారమయ్యేలా కనిపించడం లేదు.

అవినీతి ఆరోపణలు

అవినీతి ఆరోపణలు

అవినీతి ఆరోపణలు