
ఆశలు నేలమట్టం.. అందదా పరిహారం
జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయం
పండించిన పంటలపై ప్రకృతి ప్రకోపం
వర్షాకాలంలో నేలమట్టమైన మామిడి, వరి, ఇతర పంటలు
గత ఖరీఫ్‌లో వేరుశనగకు తీవ్ర నష్టం
పరిహారం అందక అల్లాడుతున్న రైతాంగం
జిల్లాలో వ్యవసాయరంగం కుదేలవుతోంది. పంటలపై ప్రకృతి విరుచుకుపడుతోంది. వరుస విపత్తులతో పంట మొత్తం దెబ్బతింటోంది. వేరుశనగ పంట ఎందుకూ పనికిరాకుండా పోయింది. రైతుల పెట్టుబడి మట్టికొట్టుకుపోయింది. నష్టం అంచనా పరిశీలనకే పరిమితమైంది. ఏడాదిలో పరిహారం చెల్లింపు విషయమై జాప్యం జరుగుతోంది. మామిడికి మద్దతు ధర దక్కని పరిస్థితి ఏర్పడింది. సాగుపై రైతులు ముఖం చాటేయాల్సి వస్తోంది. అయినా కూటమి ప్రభుత్వం అన్నదాత విషయంలో చిన్నచూపు చూస్తోంది.
కాణిపాకం: జిల్లాలో వ్యవసాయరంగంపై ఆధారపడి లక్షలాది కుటుంబాలు జీవిస్తున్నాయి. వరి, మామిడి, కూరగాయలు, పండ్ల తోటలపై అధికంగా ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. అయితే ప్రకృతి సహకరించక వీరి బతుకులు అతలాకుతలమవుతున్నాయి. సాగులో ఉన్న పంటలను భారీ వర్షాలు మింగేస్తున్నాయి. లేకుంటే అదునుకు వర్షాలు కురవక మట్టిపాలు చేస్తున్నాయి. దీంతో రైతులు కంటతడి పెడుతున్నారు.
వేరుశనగ నేలమట్టం
గతేడాది ఖరీఫ్‌లో వేరుశనగ సాధారణ విస్తీర్ణం 43,174 హెక్టార్లు కాగా 13,044 హెక్టార్లలో పంట సాగు చేశారు. అదునుకు వర్షాలు లేక 9 వేల హెక్టార్లల్లో పంట దెబ్బతింది. వీటిని వ్యవసాయశాఖ అధికారులు గుర్తించి ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు. పంట నష్టం విలువ రూ.15.42 కోట్లుగా అంచనా వేశారు. యాదమరి, గుడిపాల, పెనుమూరు మండలాలను అత్యంత కరువుల మండలాలుగా ప్రకటించారు. మరో 13 మండలాలను మధ్యస్థ కరువు మండలాలుగా ప్రకటించారు. దీనిపై కేంద్ర కరువు బృందం యాదమరి, గుడిపాల మండలాల్లో పర్యటించి పరిశీలన చేపట్టింది. అయినా ఇంత వరకు పంట నష్టపరిహారం ఇవ్వలేదని రైతులు గొగ్గోలు పెడుతున్నారు.
మామిడికి ఏదీ మద్దతు
ఈ సారి మామిడి పంట తీవ్ర ఇబ్బందికి గురిచేసింది. పండిన ఫలాలను అమ్ముకోవడానికి రైతులు పడరానిపాట్లు పడాల్సి వచ్చింది. తీరా ఆ ఫలానికి తగ్గ ప్రతిఫలం కూడా ఇంతవరకు చేతికి అందలేదు. 31 ఫ్యాక్టరీలు 49,350 మంది రైతుల నుంచి 2.31 లక్షల మెట్రిక్ టన్నుల కాయలను కొనుగోలు చేశాయి. అలాగే ర్యాంపులు 30,600 మంది రైతుల నుంచి 1.44లక్షల మెట్రిక్ టన్నుల కాయలను తీసుకున్నాయి. అవీ ఇంత వరకు రైతులకు డబ్బులు ఇవ్వలేదు. కార్వేటినగరంలోని ఫ్యాక్టరీ మాత్రం తోతాపురి కేజీకి రూ.4.90 చొప్పున్న చెల్లించింది. అయితే కూటమి ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధర మరుగున పడింది. ఎక్కడ కూడా ఫ్యాక్టరీలు రూ.8 ఇవ్వడం లేదు. ఈ విషయంలో ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభుత్వం ఇవ్వాల్సిన ప్రోత్సాహక నిధి రూ.4 చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది.
ఉద్యాన పంటల నష్టం ఇలా..
గతేడాదితో పాటు..ఈ సారి కురిసిన వర్షాలకు ఉద్యాన పంటలు 52.31 హెక్టార్లల్లో దెబ్బతిన్నాయి. మామిడి 46.60 హెక్టార్లు, టమాటా 1.96 హెక్టార్లు, కాకరకాయ 0.90 హెక్టార్లు, కీరకాయ 0.45 హెక్టార్లు, చామంతి 0.20 హెక్టార్లు, బొప్పాయి 2.00 హెక్టార్లు, బీరకాయ 0.20 హెక్టారల్లో నష్టం జరిగినట్టు అధికారులు అంచనా వేశారు. మొత్తం రైతులు 115 మంది నష్టపోగా.. రూ.34.23 లక్షలు నష్టం జరిగినట్లు లెక్కగట్టారు. అయితే ఇంత వరకు పంట నష్టపరిహారం రాకపోవడంతో రైతులు మండిపోతున్నారు.
తుపాను దెబ్బకు ఇలా...
గతేడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో తుపాను దంచి కొట్టింది. దీని ధాటికి వరి, రాగి 66.18 హెక్టార్లల్లో దెబ్బతింది. ఈ పంట సాగులో 194 మంది రైతులు నష్టపోగా...పంట నష్టం విలువ రూ.11.21 లక్షలుగా లెక్కగట్టారు. ఈ నివేదికలు ప్రభుత్వానికి చేరగా.. నష్ట పరిహారం కోసం రైతులు నెలల తరబడి ఎదురుచూస్తున్నారు.