
వికలత్వంపై మరోసారి పరిశీలన
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఇటీవల నోటీసులు అందుకున్న దివ్యాంగుల వికలత్వాన్ని మరోసారి పరిశీలించనున్నట్టు కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో దివ్యాంగులతో సమావేశం నిర్వహించి అర్జీలను స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అర్హత ఉన్న దివ్యాంగులందరికీ పింఛన్ అందజేస్తామన్నారు. నోటీసులందిన వారందరూ మరోమారు అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించినట్టు వెల్లడించారు. జిల్లా లో త్వరలో రీ అసెస్‌మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కేంద్రాల్లో ప్రత్యేక వైద్య బృందాలతో పాటు ఇతర అధికారులను నియమిస్తామన్నారు. పరిశీలన చేసే సమయంలో ఫొటో గ్రాఫర్, వీడియోగ్రాఫర్లను నియమించి పరిశీలన చేయిస్తామని తెలిపారు. జిల్లాలో పింఛన్ రీ అసెస్‌మెంట్‌కు ఇప్పటి వరకు 4 వేల దరఖాస్తులు అందినట్లు చెప్పారు. అర్హత ఉండి పింఛన్ కోల్పోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామన్నారు. సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ శ్రీదేవి, డీఎంహెచ్‌వో సుధారాణి, డీసీహెచ్‌ఎస్ పద్మాంజలి, దివ్యాంగుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు కొణతం చంద్రశేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మురళి పాల్గొన్నారు.

వికలత్వంపై మరోసారి పరిశీలన