
పేదలను దోచుకుంటున్న కూటమి ప్రభుత్వం
వెదురుకుప్పం: గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో కూటమి దోపిడీ పెచ్చుమీరుతోందని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆరోపించారు. శుక్రవారం పుత్తూరులోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా మట్టి, గ్రావెల్, ఇసుక మాఫియా రెచ్చిపోతూ ఇక్కడి నుంచి సహజ సిద్ధంగా ఏర్పడిన కొండలు, గుట్టలను కొల్లగొడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రధానంగా పాలసముద్రం మండలంలో ఉన్న కొండలు, గుట్టలను తవ్వి అక్రమంగా తమిళనాడుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో నడుస్తున్న సుమారు 33 క్వారీలల్లో కూటమి నాయకులు నియమించుకున్న వసూలు రాజాలు ముక్కుపిండి దందాలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. కూటమి నాయకులు చేస్తున్న పాపాలను వైఎస్సార్‌సీపీ నేతలకు అంటగట్టేందుకు ప్రయత్నించడం శోచనీయమన్నారు. ప్రస్తుతం ఒక్కో క్వారీ యజమాని నుంచి రూ.3 లక్షలు చొప్పున వసూలు చేసినట్లు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. తాజాగా వెదురుకుప్పం మండలం, బందార్ల పల్లె గ్రామ సమీపంలో ఎద్దల బండపై క్వారీ నడిపే ప్రయత్నంలో టీడీపీకి చెందిన రౌడీ మూకలు గ్రామస్తులపై దాడులకు దిగిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.