
మద్యం బార్ టెండర్లు
మద్యం బార్లకు దరఖాస్తులు రాకపోతే వేటు !
కలవర పెట్టిస్తున్న .. ఇతర జిల్లాల్లో బదిలీలు
14తో గడువు ముగియనున్న బార్ దరఖాస్తులు
ఆరు బార్లకు ఒక్కటి దరఖాస్తు వస్తే ఒట్టు
చిత్తూరు అర్బన్ : జిల్లాలో మద్యం బార్ల వ్యవహారం ఎక్సైజ్ శాఖలో ఓ అధికారి కుర్చీకి ఎసరు తెచ్చిపెట్టనుందా? నిర్ణీత గడువులోపు బార్లకు దరఖాస్తులు రాకుంటే ఆ అధికారిపై బదిలీ వేటు తప్పదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మద్యం బార్లకు దరఖాస్తులు కూడా వేయించనివాళ్లు, ఏం పనిచేస్తారని ఇప్పటికే రెండు జిల్లాల్లోని ఎక్సైజ్ అధికారులపై బదిలీ వేటు పడటం ఇక్కడి అధికారులను కలవరానికి గురిచేస్తోంది.
రెండు రోజులే గడువు
జిల్లాలో 12 మద్యం బార్లకు గతనెల నోటిఫికేషన్ ఇవ్వగా.. ఇందులో చిత్తూరులో 8, కుప్పం, నగరి, పుంగనూరు, పలమనేరు మున్సిపాలిటీల్లో ఒక్కో మద్యం బారు ఏర్పాటు చేయాలని నోటిఫై చేశారు. కుప్పం, పుంగనూరు, నగరితో పాటు చిత్తూరులో మూడు (ఒకటి గీత సామాజిక వర్గాలకు) బార్లకు దరఖాస్తులు రావడంతో లైసెన్సులు కేటాయించారు. పలమనేరు, చిత్తూరులోని మరో అయిదు బార్లకు దరఖాస్తులు రాకపోవడంతో వీటికి రీ–నోటిఫికేషన్ విడుదల చేశారు. వాస్తవానికి చిత్తూరు నగరంలో మెజారిటీ మద్యం బార్లు కూటమి నేతల చేతుల్లోనే ఉండేది. ప్రభుత్వం సూచించిన లైసెన్సు ఫీజులు, నాలుగు దరఖాస్తులు తప్పనిసరి అనే నిబంధనలు నచ్చకపోవడంతో నిర్వాహకులు గతంలో సిండికేట్‌గా ఏర్పడ్డట్లు తెలుస్తోంది. అందరూ మాట్లాడుకుని అయిదు బార్లకు దరఖాస్తులు వేయలేదని సమాచారం. ఈనెల 14వ తేదీ సాయంత్రంలోపు ఆరు బార్లకు దరఖాస్తు చేసుకోవడానికి గడువుగా నిర్ణయించారు.
దరఖాస్తులు రాకపోతే..
మద్యం బార్‌కు దరఖాస్తులు కూడా వేయించలేని అధికారులు, పనిచేయడం దండగ అనే కోణంలో బాపట్ల, కోనసీమ జిల్లాల్లోని ఇద్దరు ఎక్సైజ్ జిల్లా అధికారులపై బదిలీ వేటు వేశారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలోనూ ఇదే భయం పట్టుకుంది. నాటు సారా నిర్మూలన, నవోదయం 2.0తో పాటు మద్యం దుకాణాల టెండర్లు, అధికారులకు ప్రొటోకాల్స్ అన్నీ దగ్గరుండి చూసుకుంటే ఇప్పుడు మెడపై కత్తి పెట్టి మద్యం బార్ల అంశాన్ని తీసుకొచ్చారని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బార్‌లకు దరఖాస్తులు రాకుంటే బదిలీ వేటు తప్పదనే నేపథ్యంలో అధికారుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. పనితీరు బాగోలేకుంటే బదిలీ చేయొచ్చు. ప్రభుత్వ పాలసీ నచ్చకుండా నిర్వాహకులు ముందుకు రాకుంటే తమను బలి పశువు చేయడం ఎంత వరకు సమంజసమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.