జాతరలో ప్రత్యేకతలు | - | Sakshi
Sakshi News home page

జాతరలో ప్రత్యేకతలు

Sep 12 2025 6:15 AM | Updated on Sep 12 2025 6:15 AM

జాతరలో ప్రత్యేకతలు

జాతరలో ప్రత్యేకతలు

● రాష్ట్ర పండుగగా రెండురోజుల పాటు జరిగిన పోలేరమ్మ జాతర గురువారం సాయంత్రం అమ్మవారి నిష్క్రమణతో వైభవంగా ముగిసింది. ● సుమారు 2 లక్షలకు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ● ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన క్యూలైన్లు భక్తులతో కిక్కిరిశాయి.

జైపోలేరు.. జైజై పోలేరంటూ మార్మోగిన వెంకటగిరి జన జాతరకు లక్షలాది మంది రాక నిబంధనలకు స్వస్తి.. ఏరులైన పారిన మద్యం రాజాలకు అవమానం కూటమి నేతల కోసం ప్రత్యేక క్యూ ముగిసిన పోలేరమ్మ జాతర

పట్టువస్త్రాల సమర్పణ

జాతర సందర్భంగా దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అమ్మవారికి సంప్రదాయబద్ధంగా మేళతాళలతో పట్టువస్త్రాలను సమర్పించారు. దేవదాయ కమిషనర్‌ రామచంద్రయ్య, ఆలయ ఈఓ శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం వేదపండితులు ఆశీర్వచనం అందజేశారు. ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, కోవూరు ఎమ్మెల్యేలు వేమిరెడ్డి ప్రశాంతి, చైర్మన్‌ నక్కా భానుప్రియ హాజరయ్యారు.

0000

వెంకటగిరి(సైదాపురం) : కోరిన కోర్కెలు తీర్చే తల్లీ..పోలేరమ్మా.. కాపాడగరావమ్మా.. అంటూ భక్తజనం పోలేరమ్మ ఎదుట ప్రణమిల్లారు. జాతర సందర్భంగా వెంకటగిరి పురవీధులన్నీ స్వర్ణకాంతులతో దేదీప్యమానంగా కాంతులీనాయి. అమ్మవారి ప్రతిరూపాన్ని తనివితీరా దర్శించుకున్న భక్తులు పులకించారు. అమ్మలుగన్న అమ్మా.. పోలేరమ్మా తల్లీ అంటూ పట్టణ పురవీధుల్లో ప్రతిధ్వనించాయి. వెంకటగిరి పట్టణమంతా జైపోలేరూ.. జైజై పోలేరూ తల్లీ అంటూ మార్మోగింది. జిల్లా నలుమూలలే కాకుండా దేశవిదేశాల నుంచి కూడా పోలేరమ్మ జాతరకు విచ్చేయడంతో దారులన్నీ వెంకటగిరివైపే మళ్లాయి. దీంతో ఎక్కడ చూసినా జనమే దర్శనమిచ్చారు.

సారె సమర్పణ..

వెంకటగిరి రాజా కుటుంబీకుల సర్వజ్ఞకుమార కృష్ణ యాచేంద్రతోపాటు పలువురు అమ్మవారికి సంప్రదాయబద్ధంగా సారెను సమర్పించారు. ఆలయ మహద్వారం నుంచి పసుపు కుంకుమ, గాజులు, పట్టువస్త్రాలతో కూడిన సారెను అందించారు. అంతకుముందు నెల్లూరు జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ, వైఎస్సార్‌సీపీ నేత బొలిగర్ల మస్తాన్‌యాదవ్‌, వైఎస్సార్‌సీపీ నాయకులు అమ్మవారిని దర్శించుకున్నారు.

జాతరకు భద్రత..

పోలేరమ్మ జాతర రాష్ట్ర పండుగ కావడంతో కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో పాటు అధికారులు జాతర ఏర్పాట్లను పర్యవేక్షించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. అయితే అనుకున్న మేర ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తుల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఆనందోత్సాహాల నడుమ నగరోత్సవం..

భక్తజన సందోహం నడుమ నగరోత్సవం ప్రారంభం కాగా భక్తులు పెద్దఎత్తున వీక్షించారు. బుధవారం అర్ధరాత్రి అమ్మవారి మెట్టునిల్లు అయిన జీనుగులవారి వీధి నుంచి వేకువజామున నాలుగు గంటలకు అమ్మవారిని ఊరేగింపుగా తీసుకువచ్చి ఆలయం వద్ద ప్రత్యేకంగా నిర్మించిన మండపంలో అధిష్టించారు. తెల్లవారుజాము నుంచే భక్తులను దర్శనానికి అనుమతించారు. అయితే భక్తులకు నామమాత్రంగా ఓ గంట పాటు వాటర్‌, మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు. ఉచిత దర్శనం, రూ.100, రూ.300 టికెట్లను కొనుగోలు చేసిన భక్తుల కోసం పాతబస్టాండ్‌ మీదుగా కొత్తగా క్యూలైన్‌ను పొడిగించారు. అమ్మవారి సాంగెం పోలీసు బందోబస్తు నడుమ రాజా భవనం నుంచి అమ్మవారి ఆలయం వద్ద తీసుకురావాల్సి ఉండగా అవేవీ లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ ఏడాది కూటమి నేతల కనుసన్నల్లో జాతర జరిగింది. గతంలో ఉన్న వీఐపీ క్యూలైన్‌ పూర్తిగా ఎత్తేసి ప్రోటోకాల్‌ ఉన్నవారికి మాత్రమే ప్రత్యేక దర్శనమని ప్రకటించారు. కానీ అదంతా కేవలం ప్రకటనలకే పరిమితమైంది.

దున్నపోతు బలితో..

జాతర సంప్రదాయ ప్రకారం అమ్మవారికి దున్నపోతు బలి కార్యక్రమం జరిగింది. అమ్మవారి నిమజ్జనం పూర్తయ్యే వరకు గండదీపం ఆరిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. బలి పూర్తి కాగానే గ్రామ పొలిమేరల్లో నాలుగుదిక్కులా పొలి చల్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement