
మామిడి రైతులకు రూ.8 చెల్లించాల్సిందే !
గంగాధర నెల్లూరు : రాష్ట్ర ప్రభుత్వం మామిడి రైతులకు చెప్పిన మాట ప్రకారం కొనుగోలు ధర 8 రూపాయలు చెల్లించాల్సిందేనని ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతుల సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. గంగాధర నెల్లూరు మండల కేంద్రంలో గురువారం ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతుల సంక్షేమ సంఘం నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మూడు జిల్లాల కలెక్టర్లు రైతులు, సంఘాల నాయకులు పరిశ్రమ యజమానులు సమావేశం ఏర్పాటు చేసి తోతాపూరి ధర 12 రూపాయలుగా నిర్ణయించగా ప్రస్తుతం ఫ్యాక్టరీ యాజమాన్యాలు నాలుగు, ఐదు రూపాయలే చెల్లిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం నిర్ణయించిన కొనుగోలు ధర 8 రూపాయలు, సబ్సిడీ ధర 4 రూపాయలను వెంటనే రైతులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు పరిశ్రమల ముందు మామిడి రైతులు బిచ్చగాళ్లలాగా పడిగాపులు కాస్తున్నా పట్టించుకోకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. ఈనెల 15వ తేదీన ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చిత్తూరు మ్యాంగో యార్డు నుంచి కలెక్టరేట్ వరకు మామిడి రైతుల ట్రాక్టర్ వాహన మహా ర్యాలీలో రైతులు పాల్గొని కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించే కార్యక్రమం జయప్రదం చేయాలని కోరారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మామిడి రైతులు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో మామిడి రైతుల సంక్షేమ గౌరవాధ్యక్షుడు జయరాం రెడ్డి, అధ్యక్షుడు త్యాగరాజ రెడ్డి, రైతు నాయకులు వెంకటేశులు ప్రభాకర్ , పురుషోత్తం, గుణశేఖర్ రెడ్డి, ప్రకాష్ , చిట్టిబాబు మామిడి రైతులు పాల్గొన్నారు.