
సూపర్ సిక్స్ సభ అట్టర్ ఫ్లాప్
పాలసముద్రం : అనంతపురంలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన సూపర్ సిక్స్ సభ అట్టర్ ఫ్లాప్ అయిందని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సభకు ఆశించిన స్థాయిలో ప్రజా స్పందన లేదన్నారు. సభ విజయవంతం కాకపోవడంతో కూటమి నాయకులు షాక్‌కు గురయ్యారని పేర్కొన్నారు. సూపర్ సిక్స్ సభకు బలవంతంగా జన సమీకరణ చేశారన్నారు. ప్రతి మహిళా సంఘం నుంచి ఐదుగురు సభ్యులు ఈ సభకు రావాలని అధికారులు ఒత్తిడి చేయడంతో మహిళలు తప్పని పరిస్థితిలో సభకు వెళ్లారని పేర్కొన్నారు. సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు చేయకుండానే సూపర్‌హిట్ సభ నిర్వహించడం రాష్ట్ర ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేసినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి సభను నిర్వహించినా ప్రజల్లో స్పందన కరువైందన్నారు. బలవంతపు విజయోత్సవాలు చేసుకోవడం దేశంలోనే చంద్రబాబుకు మాత్రమే సాధ్యమేని విమర్శించారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని గుట్టలో ఎర్రమట్టి తమిళనాడుకు తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ధ్వజమెత్తారు. ఎన్నడు లేని విధంగా గుట్టలు మాయమవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
25 లోపు మామిడి రైతుల ఖాతాల్లో సబ్సిడీ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా మామిడి సబ్సిడీ నగదును ఈ నెల 20 నుంచి 25వ తేదీలోపు సంబంధిత మామిడి రైతుల ఖాతాల్లో జమ చేస్తామని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. ఈ మేరకు ఆయన కలెక్టరేట్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. జిల్లాలో మామిడి సీజన్‌లో 4.1 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేసిన 37 వేల మంది రైతులకు సబ్సిడీని జమచేయనున్నట్లు తెలిపారు. రైతుల ఖాతాల్లో రూ.160 కోట్ల మేర జమచేస్తామన్నారు. గత కొద్ది రోజులుగా అర్హుల నివేదికలను పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వం తరఫున రైతులకు కిలోకు రూ.4 చొప్పున సబ్సిడీ రాయితీ అందజేస్తోందన్నారు. ఒక్కొక్క రైతుకు రాయితీ రూపంలో దాదాపు రూ.40 వేలు జమవుతుందని తెలిపారు. మామిడి పరిశ్రమల ఆధ్వర్యంలో 2.35 లక్షల మెట్రిక్ టన్నులు, ర్యాంపులు, మండీల నుంచి 1.65 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి కొనుగోలు జరిగినట్టు పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో మామిడిసాగుకు రూ.10 కోట్లు ఖర్చు చేశామన్నారు. త్వరలో కృష్ణగిరి నుంచి రెండు కొత్త పరిశ్రమలు జిల్లాలో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వెదురుకుప్పం మండలంలో విధుల పట్ల అలసత్వం వహించిన ఇద్దరు వీఆర్‌వోలను ఇటీవల సస్పెండ్ చేశామన్నారు.

సూపర్ సిక్స్ సభ అట్టర్ ఫ్లాప్