
గజరాజుల బీభత్సం
పులిచెర్ల(కల్లూరు) : మండలంలోని ఆవుల పెద్దిరెడ్డిగారిపల్లె, కురవపల్లె, గౌరిశెట్టిగారి పల్లెల్లో గురువారం తెల్లవారుజామున ఏనుగుల గుంపు పంట పొలాలపై దాడి బీభత్సం సృస్టించాయి. వరుస దాడులతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. ఆవుల పెద్దిరెడ్డిగారి పల్లెలో రైతు వీరయ్య పొలంలో వరి పంటను ధ్వంసం చేశాయి. అలాగే మిగిలిన ప్రాంతాల్లో టమోటా, అరటి, కొబ్బరి చెట్లను తొక్కి నాశనం చేశాయి. అటవీశాఖ అధికారులు ఏనుగులను పొలాల్లోకి రాకుండా కట్టడి చేయాలని రైతులు కోరుతున్నారు.
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో అశ్విక (32) అనే వివాహిత గురువారం అనుమానాస్పదంగా మృతి చెందారు. వన్‌టౌన్ సీఐ మహేశ్వర కథనం.. గుడిపాలలోని 190–రామాపురానికి చెందిన అశ్విక, గంగాధరనెల్లూరుకు చెందిన అరుణ్‌కుమార్‌కు పదేళ్ల క్రితం పెద్దల సమక్షంలో పెళ్లయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. పిల్లల చదువురీత్యా దంపతులు ఇద్దరూ చిత్తూరులోని మిట్టూరులో నివాసముంటున్నారు. బుధవారం రాత్రి ఒకే గదిలో పడుకున్న దంపతులు.. తెల్లవారి చూసేసరికి పడకపై అశ్విక అచేతనంగా పడి ఉంది. ఆమె చనిపోయిందని తెలుసుకున్న భర్త గంగాధరనెల్లూరులోని ఆరిమాకులపల్లెకు మృతదేహాన్ని తీసుకెళ్లాడు. తన కుమార్తె మృతిపై అనుమానం ఉందని, మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించి, దర్యాప్తు చేస్తున్నారు.
‘అఖిల దేవతా కృతి’ పాట ఆవిష్కరణ
కాణిపాకం: కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో గురువారం పలమనేరుకు చెందిన వాసుదేవన్ రచించిన అఖిల దేవతా కృతి అనే పాటను ఆవిష్కరించారు. ఈఓ పెంచల కిషోర్ చేతుల మీదుగా పాటను ఆవిష్కరించగా పలువురు వాసుదేవన్‌ను అభినందించారు. కార్యక్రమంలో ఏఈఓ ధనపాల్, సినీ గాయకుడు గజల్ శ్రీనివాస్ పాల్గొన్నారు.