
● ఆర్‌అండ్‌బీలో వసూళ్ల పర్వం ● రూ.లక్షల్లో ఆర్జిస్తున్న
ప్రతి పనికీ ఓ రేటు!
సాక్షి టాస్క్‌ఫోర్సు : మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్నట్లు లాభంగా మారింది ఆర్‌అండ్‌బీశాఖ తీరు. ప్రతిపనికి రూ.వేలు, లక్షలు ఇచ్చినా సకాలంలో పనులు కావడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. సిబ్బంది కొరత, పనుల అవసరాన్ని సాకుగా చూపుతూ రూ.లక్షలు గడిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. జిల్లా ఆర్‌అండ్‌బీ శాఖలో బిల్లులు పాస్ కావాలన్న, ఫైల్స్ అనుమతి పొందాలన్న భారీ మొత్తంలో ముడుపులు ముట్టజెప్పాల్సిందేనని కాంట్రాక్టర్లు, బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలల తరబడి కార్యాలయాలకు తిప్పించుకుంటూ వేధిస్తున్నారని వాపోతున్నారు.
సిబ్బంది కొరత సాకుగా చూపి
జిల్లాలో మొత్తం 12 మంది ఏఈలకు 9 ఏఈలు, కార్యాలయ సిబ్బంది ఆరుగురు కొరత ఉన్నారు. దీంతో సిబ్బంది కొరతను సాకుగా చూపుతూ పనులను ఆలస్యమవుతున్నట్లు అధికారులు సర్ది చెప్పుకుంటున్నారు. కూటమి అధికారంలో వచ్చాక పల్లెపండుగ పేరిట జిల్లాలో రోడ్డు మరమ్మతు పనులను రూ.21.53 కోట్లు కేటాయించారు. ఇందుకు సంబంధించిన బిల్లుల చెల్లింపులోనూ పర్సంటేజీ వసూళ్లు చేశారు. జిల్లాలో పలు పద్దుల కింద దాదాపు రూ.250 కోట్ల పనులు మంజూరవ్వగా అందులో పలు రకాల పనులు క్షేత్రస్థాయిలో జరుగుతున్నాయి. ఇందులోను స్టేజ్ వారీగా బిల్లులు పాస్ కావాలంటే పలుకుబడి ఉంటే 5,3,2 శాతం పర్సంటేజీలు ఇవ్వాల్సిందేనని ఆరోపణలు ఉన్నాయి.
అనుమతి పేరుతో మామూళ్లు
కోళ్ల పారం, టపాసులు గోదాము, కాలేజీ భవనం, కల్యాణ మండపాలు. హోటల్స్, షాపింగ్ మాల్స్ ప్రయివేటు ఆస్పత్రి భవనాల ఎన్‌ఓసీకి దండుకుంటున్నారు. వ్యాలువేషన్ బట్టి రూ.50 నుంచి రూ.1.50 లక్ష వరకు వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. రోడ్డు వేసే కాంట్రాక్టుల నుంచి ప్రతి బిల్లుకు రూ. 15 నుంచి 20 శాతం ఇవ్వాలనే ఆరోపణలున్నాయి. క్వాలిటీ కంట్రోల్ పేరుతో నాసిరకంగా ఉన్నా మామూళ్లకు అమ్ముడుపోయి...వదిలేస్తున్నారనే విమర్శలున్నాయి.
కనిపించని నాణ్యత
పల్లె పండుగ పేరిట గత వర్షాకాలంలో ప్రారంభించి ఈ మార్చిలో 1500 కిలోమీటర్లు రోడ్డు మరమ్మతు పనులు చేశారు. కానీ ఏమి లాభం రోడ్డు వేసిన 6 నెలలకే తిరిగి గుంతలు పడ్డాయి. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా పనులు జరుగుతున్నా పర్యవేక్షణ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఓ అధికారి సెలవురోజు ఓ కాంట్రాక్టర్‌కు ఫోన్ చేసి మరీ డబ్బులు తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు చేబదులు రూపంలో రూ.లక్షలో తీసుకొని తమకు ఇవ్వాల్సిన మామూళ్లలో పట్టుకోమని చెబుతున్నారని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డబ్బులడిగితే ఫిర్యాదు చేయండి
ఆర్‌అండ్‌బీ పరిధిలో పనులు చేసుకోవడానికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. నిబంధనల ప్రకారం సరైన ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తే చాలు. బిల్లులు, ఎన్‌ఓసీ పరంగా అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదు. ఎవరైన డబ్బులు అడిగితే ఫిర్యాదు చేయండి.
– శ్రీనివాసులు, ఈఈ, ఆర్‌అండ్‌బీ
ఇవిగో ఆధారాలు ఇలా..
నగరంలో కొత్త బస్టాండ్ సమీపంలోని ఓవర్ బ్రిడ్జి కింద అనధికారంగా దుకాణం ఏర్పాటు చేశారు. ఆర్‌అండ్‌బీ అధికారులకు మామూళ్లు ఇచ్చి వ్యాపారం చేస్తున్నారనే వాదన ఉంది.
పూతలపట్టుకు చెందిన ఓ రోడ్డు కాంట్రాక్టర్ లైసెన్సు రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఎంతకు పనికాకపోవడంతో రూ.25 వేలు సంబంధిత క్లర్క్‌కు ఇచ్చాడు. వెంటనే పని చేసి రెన్యూవల్ అనుమతి ఇచ్చేశారు.
పలమనేరులో సినిమా థియేటర్ రెన్యూవల్ లైసెన్స్ కోసం అడిగినంత ఇచ్చాక వేగంగా అనుమతులు ఇచ్చారు.
పుంగనూరు, కుప్పంలో టపాసుల గోడౌన్ ఎన్‌ఓసీ కోసం ఇద్దరు దరఖాస్తు చేసుకున్నారు. ఏఈ గోడౌన్ పర్యవేక్షించి ఫైల్‌ను ఉన్నతాధికారులకు పంపాలి. కానీ వారాల తరబడి వేచిచూసిన ఆయన రాకపోవడంతో నిర్వాహకులు కార్యాలయానికి వెళ్లి ప్రాధేయపడి రప్పించుకున్నారు. తీరా అనుమతి ఇవ్వడానికి పలు కొర్రీలు పెట్టడంతో రూ.1.50 లక్షలు లంచం ఇచ్చాక అనుమతి ఇవ్వడానికి అంగీకారం తెలిపినట్లు సమాచారం.
జిల్లాలో ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, కల్యాణ మండపాలు ప్రతి పని అనుమతికి లక్షలు ఇవ్వనిదే పనులు కావడం లేదు. డబ్బులు ఇచ్చినా పలుకుబడి లేనిదే వేగంగా పనులు కావడం లేదు. ఏఈ, డీఈలు క్షేత్రస్థాయిలో పనులు చూడాలంటే కాంట్రాక్టర్లు కారులో తీసుకొని తిప్పాలి. పనులు అయ్యాక విందు ఏర్పాటు చేయాల్సిందేనని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

● ఆర్‌అండ్‌బీలో వసూళ్ల పర్వం ● రూ.లక్షల్లో ఆర్జిస్తున్న