
డ్రాపౌట్స్ తగ్గింపునకు చర్యలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో బడి బయట పిల్లలు (డ్రాపౌట్స్) తగ్గింపునకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో బడిబయట పిల్లలను గుర్తించి వారిని తిరిగి పాఠశాలల్లో చేర్పించాలన్నారు. జిల్లాలో జూలై 2025 నాటికి 4202 మంది విద్యార్థులను బడిబయట పిల్లలుగా గుర్తించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 1997 మంది విద్యార్థులను తిరిగి వివిధ పాఠశాలల్లో చేర్పించారన్నారు. పాఠశాలల్లో చేరిన బడిబయట విద్యార్థుల వివరాలను ఎంఈవోలు పాఠశాల వారీగా ప్రత్యేక ఫ్రొఫార్మాలో వివరాలు అందజేయాలన్నారు. మధ్యాహ్న భోజనాన్ని పక్కాగా మెనూ ప్రకారం అమలు చేయాలని తెలిపారు. నాణ్యత లోపిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణ, విద్యాశాఖ ఏడీ–1 సుకుమార్, ఎంఈవోలు, హెచ్‌ఎంలు పాల్గొన్నారు.