
సూపర్ సిక్స్ అట్టర్ ఫ్లాప్
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : తమ దృష్టిలో సూపర్‌సిక్స్ హిట్ కాదని... సూపర్ ఫ్లాప్ అని కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి ధ్వజమెత్తారు. చిత్తూరు నగరంలోని ప్రెస్ క్లబ్‌లో బుధవారం ఆమె విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించారన్నారు. ర50 లక్షల మంది నిరుద్యోగులకు రూ.3 వేల చొప్పున భృతి ఇస్తామని..ఇంత వరకు ఇవ్వలేదన్నారు. అలాగే 20 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తామని..ప్రైవేటు కంపెనీల ఒప్పందం పేరుతో హడావుడి చేస్తోందన్నారు. ఎన్నికలప్పుడు అన్నదాత సుఖీభవ పథకం పేరుతో రైతులకు రూ.20వేలు ఇస్తామన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.6వేలు కలిపి రూ. 20వేలు ఇస్తున్నారని, పలు రకాల కారణాలు చెబుతూ పథకంలో కోతలు పెట్టారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకు పింఛన్ ఇస్తామమని...అమలుపై నోరెత్తడం లేదన్నారు. మానవత్వం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది దివ్యాంగులకు అడ్డగోలుగా పింఛన్లను తొలగించారన్నారు. వితంతులకు పింఛన్లు లేవన్నారు. యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఇలాంటప్పుడు సూపర్‌సిక్స్ విజయవంత సభల నిర్వహించుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. విభజన హామీలపై కూటమి ప్రభుత్వం కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను ఎందుకు మోదీకి తాకట్టుపెట్టారన్నారు. కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ, కిల్లి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.