
పీహెచ్‌సీల్లో అందుబాటులో లేని మందులు
జ్వరానికి సైతం మందులు, మాత్రలు లేని వైనం
ఇండెంట్ పంపినా సరఫరాలో జాప్యం
సెంట్రల్ డ్రగ్స్‌లోనే కొరత అంటున్న వైద్యాధికారులు
అవస్థలు పడుతున్న పల్లె జనం
జిల్లాను జ్వరాలు వణికిస్తున్నాయి. ప్రతి ఇంటా జ్వరంతో ఇద్దరూ, ముగ్గురూ మంచం పట్టారు. పీహెచ్‌సీల్లో మందుల్లేక వైద్యం మొక్కుబడిగా మారింది. జ్వరానికి సైతం మాత్రలు, మందుల్లేక బయట కొనుక్కోవాల్సి రావడం రోగులను ఆందోళనకు గురి చేస్తోంది. దీంతో ప్రైవేటు ఆస్పత్రికి పరుగులు తీస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇంటింటికీ వెళ్లి నాడీపట్టి మందులు ఇచ్చేవారు. కూటమి ప్రభుత్వంలో నేడు ఆసుపత్రికి వెళ్లినా మందుల్లేక విలవిల్లాడిపోతున్నారు.
కాణిపాకం : తరచూ కురుస్తున్న వర్షాలు, వాతావరణ మార్పుల కారణాలతో పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా జ్వరాలు ప్రబలుతున్నాయి. ప్రతి గ్రామంలో జ్వర పీడితులు ఉన్నారు. పేదలు వైద్యం కోసం పీహెచ్‌సీలకు వెళ్తే ఒకటి, రెండు మాత్రలు మినహా అత్యవసరమైన ఔషధాలు లభించడం లేదు. ఆరోగ్య కేంద్రాల్లో మందులు, మాత్రలు లేక వెలవెలబోతున్నాయి. కేంద్రాల నుంచి ఇండెంట్ పెట్టి నెలలు గడస్తున్నా సరఫరా విషయంలో జాప్యం నెలకొంది.
జిల్లా వ్యాప్తంగా 50 పీహెచ్‌సీలున్నాయి. ప్రతి పీహెచ్‌సీకి నిత్యం 100–200 వరకు ఓపీలొస్తున్నాయి. 50–75 మంది వరకు దీర్ఘకాలిక వ్యాధులతో ఆసుపత్రులకు వస్తున్నారు. ప్రస్తుతం మలేరియా, డెంగీ, టైఫా యిడ్‌తో పాటు, విష జ్వరం, రోగాలు వ్యాపిస్తున్నాయి. ఇటీవల పీహెచ్‌సీలకు జ్వరం కేసులు అధికమయ్యాయి. దగ్గు, జలుబు, గొంతునొప్పి, ఇతర లక్షణాలతో క్యూ కడుతున్నారు. వీరికి వైద్య సేవలను అటు ఉంచితే...మందు బిల్లలూ కరువయ్యాయి.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పీహెచ్‌సీలో మందులు, మాత్రలు ఫుల్‌గా ఉండేవి. కొరత వచ్చిన వెంటనే వాటిని అప్పటికప్పుడే భర్తీ చేసేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మందులు, మాత్రల కొరత వేధిస్తోంది. నెలల తరబడి మందులు, మాత్రల కొరత ఉన్నా పట్టించుకోవడంలేదు. సెంట్రల్ డ్రగ్స్‌లో కూడా ఇదే పరిస్థితి ఎదురవుతోందని వైద్యాధికారులు చెబుతున్నారు.
ప్రబలుతున్నా నిర్లక్ష్యమే
జిల్లాలో జ్వరాలు తాండవిస్తున్నాయి. చిత్తూరు, నగరి, జీడీ నెల్లూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లో జ్వరాల కేసులు పెరిగిపోతున్నాయి. ఊరురా జ్వరాలు ప్రబలుతున్నాయి. అయితే జ్వరాలతో పీహెచ్‌సీలకు వెళ్తే తగ్గడం లేదని బాధితులు చెబుతున్నారు. పీహెచ్‌సీలకు నిర్లక్ష్య జబ్బు అంటుకుంటోంది. జ్వరానికి మందులు, మాత్రలు లేని దుస్థితి ఏర్పడింది.
బయటకొనుక్కోండి
ఆరోగ్య కేంద్రాల్లో మందు బిల్లలు లేక పల్లె ప్రజలు అవస్థలు పడుతున్నారు. జ్వరం, ఇతర నొప్పులతో ఆస్పత్రికి వస్తే...గంటల కొద్ది క్యూలో వేచి ఉంటున్నారు. ఆ తర్వాత ఏంటీ సమస్య అని అడిగి మందులు, మాత్రలు రాయిస్తున్నారు. ఈ చీటీని మందులు, మాత్రలు ఇచ్చే సిబ్బంది దగ్గరికి తీసుకెళ్తే ఇవీ లేవని బయటే తీసుకోవాలని చెప్పి పంపించేస్తున్నారు. డబ్బులు లేక వచ్చే వారు బయట మాత్రలు తీసుకోవాలంటే ఇబ్బందులు పడుతున్నారు. కీళ్ల, నొప్పులు, కండరాలు, శ్వాస సంబంధిత మాత్రలకు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
వారంలో కేసుల వివరాలు
కేసు రకం; పరీక్ష చేసినవారి సంఖ్య; నమోదైన కేసులు
జ్వరం; 0; 0
టైపాయిడ్; 384; 30
మలేరియా; 2540; 1
డెంగీ; 423; 8
పీహెచ్‌సీ ఓపీల సంఖ్య
నెల; ఓపీ సంఖ్య
ఏప్రిల్; 1,95,587
మే; 2,19,915
జూన్; 2,20,556
జూలై; 1,96,665
ఆగష్టు; 1,92,513
మాత్రలు బయట కొనమంటున్నారు..
మోకాళ్ల నొప్పుల సమస్యలతో కొన్నేళ్లుగా బాధపడుతున్నా.. మందుల కోసం గవర్నమెంట్ ఆస్పత్రికి పోతే స్టాక్ లేదంటున్నారు. మాత్రలు బయటకొనమని చీటీలు రాస్తున్నారు. రూ.వందల్లో ఖర్చు అవుతోంది. ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించుకునే స్తోమత లేకనే ఇక్కడికి వస్తున్నాం. ఇక్కడ కూడా మందులు బయటకు రాస్తున్నారు. మాలాంటి వాళ్లు ఏం చేయాలి. – శ్రీనివాసులు, ఐరాల
సెంట్రల్ డ్రగ్స్‌కు నివేదిక పంపాం
మందుల కొరత ఉందని మా దృష్టికి వచ్చింది. వెంటనే సెంట్రల్ డ్రగ్స్‌కు నివేదిక పంపాం. ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాం. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని మండల వైద్యాధికారులకు సూచించారు. వారిని క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించాం. ఆరోగ్య కేంద్రాలకు వచ్చే ప్రజలకు ఇబ్బంది లేకుండా వైద్య సేవలు అందిస్తాం. – సుధారాణి, డీఎంహెచ్‌ఓ, చిత్తూరు
కొన్ని రోజులుగా ఇలానే ఉంది..
విష జ్వరాలు వస్తున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులు కొరత ఉంది. ఏ రోగానికి వెళ్లినా మందులు లేవని ఉన్నవాటితో సర్దుకుంటున్నారు. కొన్ని రోజులుగా ఇలానే ఉంది. జ్వరానికి మందులు, మాత్రలు లేవంటే మాలాంటి వాళ్లు ఇబ్బందులు పడక తప్పదు. ప్రభుత్వం స్పందించి మందులు, మాత్రలు ఇవ్వాలి. –ధనపాల్, ఆముదాల, పాలసముద్రం మండలం
పడిపోతున్న ఓపీ
నిర్వహణలోపం, డాక్టర్ల అలసత్వం కారణంగా పీహెచ్‌సీలో ఓపీల సంఖ్య గణనీయంగా పడిపోతోంది. పీహెచ్‌సీల్లో డాక్టర్లు సమయానికి రావడంలేదనే విషయం లోతుగా పాతుకుపోయింది. వచ్చిన తళుక్కుమని మాయమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవేళ మధ్యాహ్నం వరకు ఉండి..ఆపై మీటింగ్, ఇతర కారణాలు చెప్పి విధులకు డుమ్మా కొట్టేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీంతో పల్లె వైద్యం పడకేసింది. సీజనల్ వ్యాధులు ముసురుకుంటున్నా వైద్యులు కానరావడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు మందులు, మాత్రలు దొరక్కపోవడంతో ఓపీ సంఖ్య ఇంకాస్త తగ్గుముఖం పట్టింది.
ఇవీలేవు...
పీహెచ్‌సీల్లో చాలా వరకు మాత్రల కొరత అధికంగా ఉన్నాయి. పారాసెటమాల్ 500 ఎంజీ, 650 ఎంజీ(జ్వరం, తలనొప్పి), డైక్లోఫెనాక్(కీళ్లు సంబంధిత వ్యాధులకు), రాంటాక్ (కడుపునకు సంబంధించినవి), పాంటాప్ (గ్యాస్ట్రిక్), యాంటీబయాటిక్‌లతో పాటు మరో 10 రకాల మాత్రలు లేవు. అలాగే పారా సెటమాల్, అంబ్రోక్స్ (గొంతు, తదితర సమస్యలకు), సీపీఎం(అలర్జీ) సిరఫ్‌లు ఖాళీ అయ్యాయి. దీంతో పాటు పారాసెటమాల్ ఇంజెక్షన్, రాంటాక్, వోవెరాన్(కండరాలు, కీళ్లు), గాంటామిసిన్(యాంటీబయాటిక్), అమికాసిన్(చర్మం, ఊపిరితిత్తులు, తదితర వ్యాధులకు) అనే ఇంజెక్షన్‌లు కరువయ్యాయి. నెలల తరబడి ఇవీ సరఫరా కాకపోవడంతో పల్లె జనానికి ప్రాథమిక ఆరోగ్యం దూరమైంది.
ప్రైవేటు ఆస్పత్రులే దిక్కు
పీహెచ్‌సీలు గాడితప్పడం, మందులు, మాత్రలు దొరక్కపోవడం, వైద్యులు అందుబాటులో లేకపోవడంతో పల్లె ప్రజలకు ప్రైవేటు ఆస్పత్రులే దిక్కుగా మారుతున్నాయి. మండల కేంద్రం, పట్టణ ప్రాంతాల్లోని ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. లేకుంటే ఆర్‌ఎంపీల వద్ద చూపించుకుంటున్నారు. ఇందుకు రవాణా ఛార్జీలు, ఆస్పత్రి ఫీజులతో జేబులు ఖాళీఅవుతున్నాయి. జ్వరానికి ప్రైవేటు ఆస్పత్రికి వెళితే రూ.600 నుంచి రూ.2 వేల వరకు ఖర్చువుతోంది. డెంగీ, టైపాయిడ్ జ్వరమంటే రూ. 5 వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చువుతోంది. ల్యాబ్ టెస్టులు అదనంగా మారింది.