
సీఎం సేవలో ఆర్టీసీ
జిల్లాలోని ఆర్టీసీ బస్సులుసీఎం సభకు మళ్లింపు జిల్లా నుంచి 300 బస్సులు తరలింపు బస్సుల్లేక ప్రయాణికుల కష్టాలు
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : సీఎం చంద్రబాబు వివిధ ప్రాంతాల్లో పర్యటించే ప్రతిసారీ ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. సీఎం పాల్గొనే సభలను విజయవంతం చేసే ప్రయత్నంలో భాగంగా ఆర్టీసీ బస్సులను వాడుకుంటున్నారు. ఈ విషయం ముందస్తుగా తెలియక పోవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఆర్టీసీ యాజమాన్యం ఇవేమీ పట్టనట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.
జిల్లాతో పాటు ఇతర జిల్లాలో జరిగే సీఎం చంద్రబాబు పర్యటనకు ఆర్టీసీ బస్సులు వాడుకుంటున్నారు. ఈ క్రమంలో బుధవారం అనంతపురం జిల్లాలో జరిగే సభకు జిల్లాలోని బస్సులను తరలించారు. అక్కడ సభను విజయవంతం చేసేందుకు జిల్లా బస్సులను పంపించేశారు. మంగళవారమే బస్సులన్నీ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు తరలించారు. దీంతో బుధవారం ఉదయం నుంచి జిల్లాలో బస్సుల కొరత వేధించింది. బస్సుల్లేక ప్రయాణికులు అగచాట్లు పడ్డారు. జిల్లాలోని ఐదు డిపోల పరిధిలో 426 బస్సులుంటే 300 బస్సులను సభకు పంపించేశారు. ఇందులో తిరుపతి, వేలూరు, బెంగుళూరు మార్గాల్లో తిరిగే బస్సులు అధికంగా ఉన్నాయి. పల్లె వెలుగు బస్సులను సైతం వదల్లేదు.
ముందస్తు సమాచారం లేకుండా..
ఆర్టీసీ బస్సులను సీఎం సభకు తరలిస్తారనే ముందస్తు సమాచారం లేకపోవడంతో బుధవారం ఉదయం నుంచే ప్రయాణికులు బస్టాండుకు వచ్చి షాక్‌కు గురయ్యారు. గమ్యం చేరుకోవడానికి పడిగావులు పడ్డారు. డొక్కు బస్సులు తప్ప మిగిలిన సూపర్ లగ్జరీ, ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగుతో సహా సభకు తరలించారు. ఫలితంగా గ్రామాలు, మండల కేంద్రాలకు రాకపోకలు సాగించేవారు ఇబ్బందులు పడ్డారు.
ప్రైవేటు వాహనాలే దిక్కు..
గంటల తరబడి బస్టాండుకు బస్సులు రాకపోయే సరికి ప్రైవేటు వాహనాలు, ఆటోలను ఆశ్రయించాల్సి వచ్చింది. బస్సులను సభకు పంపిన విషయంపై సమాచారం లేకపోవడంతో ప్రయాణికులు ఆర్టీసీ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. ఇదే అవకాశంగా ప్రైవేటు వాహనాదారు లు రెచ్చిపోయారు. ఏకంగా చిత్తూరు ఆర్టీసీ బస్టాండుకే వాహనాలను తీసుకొచ్చి ప్రయాణికులను ఎక్కించుకొని వెళ్లారు. ప్రయాణికులపై చార్జీల మోత వేశారు.
పట్టించుకోని అధికారులు
ఆర్టీసీ ఇష్టానుసారంగా బస్సులను సీఎం సభలకు మళ్లించి. జిల్లా పర్యటనతో పాటు ఏ జిల్లాలో సభ జరిగినా ఆర్టీసీ అధికారులు అప్పన్నంగా బస్సులను పంపుతున్నారు. ప్రయాణికుల కష్టాలను పట్టించుకోకుండా ఎప్పడు పడితే అప్పుడు బస్సులను మళ్లించడం ఆర్టీసీకి పరిపాటిగా మారిందని పలువురు ప్రయాణికులు మండిపడుతున్నారు.
చిత్తూరు బస్టాండ్‌లో బస్సుల కోసం నిరీక్షిస్తున్న ప్రయాణికులు

సీఎం సేవలో ఆర్టీసీ

సీఎం సేవలో ఆర్టీసీ