
ఇష్టారాజ్యంగా అక్రమ తవ్వకాలు
పాలసముద్రం : మండలంలోని వనదుర్గాపురం పంచాయతీ జగనన్న కాలనీ సమీపంలోని గుట్టలో కూటమి నేతలకు ఎర్రమట్టి గ్రావెల్ మంజూరైంది. కానీ బుధవారం అనుమతి పేరుతో ఎక్కడ ఎర్రమట్టి బాగుందో అక్కడ కూటమి నాయకులు హిటాచీతో ఎర్రమట్టిని టిప్పర్‌లలో తమిళనాడుకు తరలించి డబ్బులు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయం తెలుకున్న గ్రామస్తులు తహసీల్దార్ అరుణ కుమారి , ఎస్‌ఐ చిన్నరెడ్డప్పకు వివరించారు. వారు సంఘటన స్థలానికి చేరుకునే లోగానే వారికి మంజూరైన ప్రదేశానికి హిటాచీలను, టిప్పర్‌ని తరలించారు. వారికి మంజూరైన చోటులో సర్వేయర్ సహాయంతో హద్దులు చూపించారు. ఇందులో చుట్టు పక్కల 30 అడుగులు వదిలేసి మిగిలిన చోటనే మట్టిని తీసుకోవాలన్నారు. అలా కాకుండా ఇష్టానుసారం మట్టిని తరలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు పంచాయతీ ఇచ్చిన తీర్మానంలో 2.95 హెక్టార్లకు క్వారీకి అనుమతి ఇచ్చినట్టు ఉంది. కాగా మైనింగ్ అధికారులు ఇచ్చిన అనుమతిలో 4.900 హెక్టార్లలో క్వారీకి అనుమతి ఇచ్చినట్లు పరస్పర విరుద్ధంగా అనుమతులు ఉండడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.