చౌడేపల్లె: రైతు ఉత్పత్తిదారుల సంస్థకే యూరియా కేటాయించేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని రైతు ఉత్పత్తిదారుల సంఘ మండల అధ్యక్షుడు వెంకటరమణ కోరారు. మంగళవారం స్థానిక కార్యాలయంలో రైతులు, డైరెక్టర్లతో కలిసి సమావేశం నిర్వహించారు. ఉత్పత్తిదారుల సంఘం పరిధిలో 2,315 మంది రైతులు సభ్యులుగా ఉన్నారని, వరి, గడ్డి సేద్యం సాగుకోసం ప్రతి రైతుకూ యూరియా అవసరమని చెప్పారు. ప్రభుత్వం రైతుసేవా కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్న యూరియాలో కొంతమేరకు మాత్రమే సరిపోతోందని, ఇంకనూ యూరియా అవసరం ఉందని సమావేశంలో తీర్మానించారు. రైతు ఉత్పత్తిదారుల సంస్థ ద్వారా యూరియా కొనుగోలుకు ముందస్తుగానే సొమ్ము చెల్లిస్తామని, ఉన్నతాధికారులు స్పందించి యూరియా మంజూరుచేస్తే రైతులకు పారదర్శకంగా పంపిణీ చేస్తామని చెప్పారు. సమావేశంలో డైరక్టర్లు కృపాకర్‌రెడ్డి, కృష్ణప్ప పాల్గొన్నారు.