వెన్నుదన్నుగా నిలిచిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు పలమనేరులో భారీ ర్యాలీ హోరెత్తిన నినాదాలు అడుగడుగునా పోలీసుల ఆంక్షలు
పలమనేరు ఆర్డీవోకు వినతి పత్రం అందజేస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి, జెడ్పీచైర్మన్, మాజీ ఎమ్మెల్యే
పలమనేరులో ర్యాలీగా వెళ్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ
సాక్షి ప్రతినిధి, తిరుపతి: కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి అన్నదాతలు అగచాట్లు ఎదుర్కొంటున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. సరైన విత్తనాలు.. చాలినంత ఎరువులు అందక అష్టకష్టాలు పడుతున్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా యూరియా కొరత మెడకు చుట్టుకోవడంతో గిజగిజా కొట్టుకుంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రైతు సేవా కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఎర్రటి ఎండనూ లెక్కచేయక ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. ఇన్ని అవస్థలు పడుతున్నా కూటమి నేతలు పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారు. దీనిపై అన్నదాతలు రగిలిపోతున్నారు.
వీరికి అండగా వైఎస్సార్‌సీపీ ‘అన్నదాత పోరు’కు పిలుపునిచ్చింది. మంగళవారం వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పలమనేరు, కుప్పం, చిత్తూరు, నగరి ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిరసన చేపట్టారు. రెవెన్యూ డివిజనల్ అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎరువులు బ్లాక్ మార్కెట్‌కు వెళ్లకుండా నియంత్రించాలని కోరారు. వేరుశనగ, వరి ధాన్యానికి మద్దతు ధర కల్పించాలని, పంటలకు ఉచిత బీమా అమలు చేయాలని సూచించారు.
కుప్పంలో ఆంక్షల జోరు
ఎమ్మెల్సీ, కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త భరత్ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని రైతు సమస్యలను పరిష్కరించాలని అధికారికి వినతి పత్రం సమర్పించారు. పార్టీ శ్రేణులు, రైతులు నిరసన కార్యక్రమంలో పాల్గొనకుండా పోలీసులు అడ్డుకున్నారు. 30 యాక్ట్ అమలులో ఉందని, ర్యాలీలు, ధర్నాలు చేయకూడదని సోమవారం రాత్రే ఆంక్షలు విధించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీచేశారు. కేవలం ఐదుగురు.. లేదా ఆరుగురితో ఆర్డీఓ కార్యాలయాలకి చేరుకుని వినతి పత్రం సమర్పించాలని హుకుం జారీచేశారు. ఎమ్మెల్సీ భరత్ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని వినతి పత్రం సమర్పించారు.
చిత్తూరులో అడ్డగింపులు
చిత్తూరులో ర్యాలీలు, నిరసన చేపట్టకూడదని పోలీసులు ఆంక్షలు విధించారు. అయితే పలు ప్రాంతాల నుంచి తరలి వచ్చిన రైతులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు ర్యాలీ చేపట్టేందుకు పూనుకున్నారు. మాజీ మంత్రి నారాయణస్వామి, చిత్తూరు, పూతలపట్టు, జీడీ నెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్తలు విజయానందరెడ్డి, డాక్టర్ సునీల్‌కుమార్, కృపాలక్ష్మి, పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే లలితకుమారి పాల్గొని అన్నదాతలకు మద్దతుగా నిలిచారు. అన్నదాత పోరు కార్యక్రమంలో భాగంగా గంగినేని చెరువు నుంచి చిత్తూరు ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓకి వినతి పత్రం సమర్పించారు.
నిరసనలతో గర్జించిన నగరి
నగరిలో మాజీ మంత్రి ఆర్‌కే రోజా ఆధ్వర్యంలో పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు పార్టీ నాయకులు, కార్యర్తలు, రైతులు కలిసి ర్యాలీ నిర్వహించారు. రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అన్నదాతలు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓకి వినతి పత్రం సమర్పించారు.
హోరెత్తిన పలమనేరు
పలమనేరులో మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పలమనేరు నియోజకవర్గ సమన్వయకర్త వెంకటేగౌడ్, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు రైతులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని సిల్క్ ఫాం నుంచి ప్రారంభమైన ర్యాలీ ఆర్డీఓ కార్యాలయం వరకు సాగింది. రైతులు, వైఎస్సార్‌సీపీ శ్రేణుల నినాదాలతో పలమనేరు పట్టణం హోరెత్తింది. అనంతరం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆర్డీఓకి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు భారీగా తరలివచ్చారు.
సమస్యలపై కదంతొక్కిన రైతన్నలు
జిల్లాలో అన్నదాతలు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పోరుబాట పట్టారు. ఏడాదిన్నరగా ఎదర్కొంటున్న సమస్యలపై నిరసనలు మిన్నంటించారు. వరి, వేరుశనగ, మామిడి పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి నేతలు విఫలమయ్యారని ధ్వజమెత్తారు. ఎన్నడూ లేని విధంగా యూరియా కొరతతో అల్లాడుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వచ్చిన ఎరువులను కొందరు నేతలు బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్నారని అనుమానాలు వ్యక్తం చేశారు. ‘కక్ష సాధింపు మానుకో.. గిట్టుబాటు ధరలిచ్చుకో..!,’ ‘నాటకాలు ఆపు..ఎరువులివ్వు బాబూ’! అంటూ నినాదాలు మిన్నటించారు. అనంతరం ఆర్డీఓలకు వినతి పత్రాలు సమర్పించారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా గడిచిన నాలుగు దఫాలు ఎప్పుడైనా రైతులు సంతోషంగా ఉన్నారా..?. ఆయన అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ వారికి కన్నీళ్లే. పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఉండదు. ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమా ఊసేలేదు. కనీసం యూరియా దిక్కులేని పాలన కేవలం చంద్రబాబుకే దక్కింది. యూరియా బ్లాక్‌మార్కెట్‌కు తరలించిన ఘనత కూటమి సర్కార్‌కే చెల్లుతుంది. యూరియా ఎక్కువ వాడితే భూసారం దెబ్బతింటుందని చంద్రబాబు ఉచిత సలహాలు ఎవరికోసం గుప్పిస్తున్నాడో రైతులు గుర్తించాలి. కేవలం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులకు గిట్టుబాటు ధరలేక పలువురు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఎదురైంది. ఈ ప్రాంతంలో టమాటాకు రేట్లు లేక రోడ్డుపాలు చేసిన ఘటనలు చూశాం గానీ ఎప్పుడైనా మామిడిని రోడ్డుపై పడేశారా..?. గత ప్రభుత్వంలో కోవిడ్‌లాంటి కష్ట సమయంలోనూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డికే దక్కింది. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే
బాబొస్తే కన్నీరే
బాబొస్తే కన్నీరే
బాబొస్తే కన్నీరే
బాబొస్తే కన్నీరే
బాబొస్తే కన్నీరే