
పలుకుబడి ఉన్నోళ్లకే యూరియా
యాదమరి: ‘మీరిచ్చే ఒక్క బస్తా యూరియా కోసం గంటల తరబడి క్యూలో నిరీక్షిస్తున్నాం. కానీ మీరేమో గుట్టుచప్పుడు కాకుండా రాజకీయంగా పలుకుబడి ఉన్నోళ్లకే బినామీ టోకెన్లు జారీచేసి ఇచ్చేస్తున్నారు. అడిగితే స్టాకు లేదని అంటున్నారు. ఇదెక్కడి న్యాయం’ అని పలువురు రైతులు రైతు సేవా కేంద్రంలోని సిబ్బందిని ప్రశ్నించారు. ఈ ఘటన మంగళవారం మోర్దానపల్లి రైతు సేవా కేంద్రం వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సోమవారం మండల పరిధిలోని మోర్దానపల్లి రైతు సేవా కేంద్రానికి 300 బస్తాల యూరియా వచ్చింది. దీని కోసం రైతులు ఉదయం 7 నుంచే క్యూలో వేచి ఉన్నారు. అయితే ఎప్పటిలాగే ఆర్‌ఎస్కే సిబ్బంది 11 గంటలకు వచ్చారు. అప్పటికే ఆకలితో అలమటిస్తున్న అన్నదాతలు సిబ్బంది ధోరణిపై అసహనానికి గురయ్యారు. రాజకీయ పలుకుబడి ఉన్నవాళ్లకి దొడ్డిదారిన యూరియా అందించడంతో, ఇది గమనించిన రైతులు ఓ మహిళా సిబ్బందిని ప్రశ్నించారు. ఒకానొక దశలో ఆ మహిళా ఉద్యోగితో తీవ్ర వాగ్వాదం ఏర్పడింది. మండలంలో రెండు నెలల కిందట వేరుశనగ విత్తనాల పంపిణీ సమయంలో కూడా ఆ మహిళా ఉద్యోగి రైతులపై దురుసుగా ప్రవర్తించినట్టు అక్కడి రైతులు పేర్కొన్నారు. కాగా వచ్చిన 300 బస్తాల యూరియాలో మోర్దానపల్లి, యాదమరి, కీనాటంపల్లి, వరదరాజులుపల్లి, 14కండ్రిగ, కోనాపల్లి పచాయతీల నుంచి 222 మంది అన్నదాతలకు ఒక్కో బస్తా చొప్పున అందించారు. మిగిలిన 78 బస్తాలను బుధవారం మాధవరం, జంగాలపల్లి పంచాయతీలోని రైతులకు పంపిణీ చేయనున్నట్లు ఏఓ దీప చెప్పారు.