
‘ఎద్దల బండ’పై గద్దలు!
కూటమి ప్రభుత్వంలో పచ్చమూక రెచ్చిపోతోంది. ప్రకృతి వనరులను యథేచ్ఛగా దోచుకుంటోంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నట్టు ఇష్టారాజ్యంగా అక్రమార్జనకు పాల్పడుతోంది. అందులో భాగంగానే బందార్లపల్లె సమీపంలోని ఎద్దల బండపై కన్నేసింది. కొండను పగులగొట్టి కాసులు పోగేసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. అధికారుల అండతో క్వారీ నడిపేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే స్థానికుల అడ్డుతొలగించుకునేందుకు దాడులకు పాల్పడుతోంది. పోలీసులను సైతం ఉసిగొల్పి భయభ్రాంతులకు గురిచేస్తోంది.
వెదురుకుప్పం : మండలంలోని కొమనగుంట పంచాయతీ బందార్లపల్లె గ్రామానికి సమీపంలో ఎద్దలబండ ఉంది. సుమారు 7 ఎకరాల విస్తీర్ణంలోని ఈ కొండపై క్వారీ నడిపేందుకు టీడీపీ నేతలు యుగంధర్‌నాయుడు, తదితరులు సన్నాహాలు సాగిస్తున్నాడు. అధికారులను మామూళ్ల మత్తులో జోకొట్టి అనుమతులు సైతం తీసేసుకున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆ ప్రాంతంలో క్వారీ ప్రారంభమైతే సమీపంలోని తమ పంట పొలాలు నాశనమవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పొంచి ఉన్న ప్రమాదం
ఎద్దల బండపై క్వారీ నడిపితే పేలుళ్ల కారణంగా వచ్చే దుమ్ముధూళితో వాతావరణ కలుషితమవుతుందని బందార్లపల్లె వాసులు ఆందోళన చెందుతున్నారు. పొలాల్లో దుమ్ము పేరుకుపోయి పంటలు పండే ఆస్కారం ఉండదని వాపోతున్నారు. వాయుకాలుష్యం కారణంగా దీర్ఘకాలిక రోగాలు ప్రబలే ప్రమాదం పొంచి ఉందని ఆరోపిస్తున్నారు. అలాగే క్వారీ పేలుళ్లతో గ్రామంపై రాళ్లు పడి స్థానికుల ప్రాణాలకే ముప్పు వాటిల్లే దుస్థితి దాపురిస్తుందని మండిపడుతున్నారు. పేలుళ్ల శబ్దాలకు ఇళ్లు సైతం బీటలువారే ప్రమాదముందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛమైన గాలితో ప్రశాంతంగా తమ గ్రామం ఉంటుందని, క్వారీ కారణంగా పూర్తిగా నాశనమవుతుందని వాపోతున్నారు.
పట్టించుకోని అధికారులు
సుమారు రెండు నెలలుగా క్వారీ విషయం గందరగోళంగా మారినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. తాంబూలం ఇచ్చేశాం.. తన్నుకు చావండి అన్నట్టు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు. క్వారీకి అనుమతులు మంజూరు చేసి నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నారని ఆరోపిస్తున్నారు. ఇదే అదునుగా సదరు క్వారీ యజమాని సుమారు 20 మంది రౌడీలను తీసుకువచ్చి తమపై దాడి చేయించినా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరకు పోలీసులు కూడా అక్రమార్కులకే వంతపాడుతున్నారని, కేసులు పెడతామని బెదిరిస్తున్నారని వాపోతున్నారు. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ప్రశాంతమైన తమ ఊరును కాపాడాలని విన్నవిస్తున్నారు.
అడ్డు పడితే అంతే..
బందార్లపల్లె వాసుల సమస్యలను గుర్తించకుండా కేవలం ధన దాహంతో క్వారీ యజమాని పనులు చేపడుతున్నాడు. క్వారీ కారణంగా తలెత్తే అనర్థాలను పక్కన పెట్టి ఎలాగైనా బండను కొల్లగొట్టేందుకే అభ్యంతరాలను ఖాతరు చేయడం లేదు. అధికారులను గుప్పిట్లో పెట్టుకుని గ్రామస్తులను బెదిరింపులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గూండాలను సైతం రంగంలోకి దింపి దాడులకు పాల్పడుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఇది మా ప్రభుత్వం.. మా ఎమ్మెల్యే.. ఇక్కడ అధికారం మాది అంటూ ముప్పతిప్పలు పెడుతున్నాడని ఆవేదన చెందుతున్నారు.
బీడు పెట్టుకోవాల్సిందే..
ఎద్దలబండపై క్వారీ నిర్వహిస్తే సమీపంలోని 20 ఎకరాలను బీడు పెట్టుకోవాల్సిందే. భూములు సాగుకు పనికిరాకుండా పోతాయి. క్వారీ వద్దని అభ్యంతరం చెబితే మహిళలని కూడా చూడడం లేదు. విచక్షణా రహితంగా దాడి చేస్తున్నారు. రైతులకు అండగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదు.
– ధనలక్ష్మి, బందార్లపల్లె
ఊరొదిలి వెళ్లాల్సిందే..
ఎద్దల బండపై క్వారీ మొదలైతే అందరం ఊరొదిలి వెళ్లిపోవాల్సిందే. ఇళ్లు, పొలాలు నాశనమవుతాయి. ప్రాణాంతక వ్యాధులు చుట్టుముడతాయి. మేత కరువై పశువుల పెంపకం కష్టతరంగా మారుతుంది. ఇప్పుడు ఎద్దల బండపై పంట నూర్పిళ్లు కూడా చేసుకుంటున్నాం. టీడీపీ నేతలు మా కష్టాలను గమనించి కనికరించాలి.
– జయంత్ రెడ్డి, బందార్లపల్లె

‘ఎద్దల బండ’పై గద్దలు!

‘ఎద్దల బండ’పై గద్దలు!

‘ఎద్దల బండ’పై గద్దలు!