
పోలీసుల తనిఖీ
చిత్తూరు కలెక్టరేట్ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అర్జీలు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని ఆదేశించారు. గైర్హాజరైతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
పోలీస్ కార్యాలయంలో..
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని వన్‌టౌన్ పక్కన ఉన్న ఆర్ముడు రిజర్వు (ఏఆర్) కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) నిర్వహించనున్నట్లు ఎస్పీ మణికంఠ తెలిపారు. ప్రజలు వారి సమస్యలను నేరుగా తనను కలిసి తెలియజేయవచ్చని సూచించారు. ఉదయం 10.30 గంటల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు.
బస్సుల్లో టాస్క్‌ఫోర్స్ తనిఖీలు
గుడిపాల : తమిళనాడుకు వెళుతున్న బస్సులను ఆదివారం గుడిపాల పోలీసుల సహకారంతో తిరుపతి ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఓ బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు ఎర్రచందనం కూలీలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ నిమిత్తం కూలీలను తిరుపతికి తరలించారు.
ఎంపీడీఓలకు ఉద్యోగోన్నతి
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలోని పలువురు ఎంపీడీఓలకు డీడీఓలుగా ఉద్యోగోన్నతి లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 46 మంది ఎంపీడీఓలను డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్లు(డీడీఓ)గా ఉద్యోగోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా ఐరాల ఎంపీడీఓ ధనలక్ష్మిని డ్వామా ఏపీఓ (ఎంఅండ్‌ఈ)చిత్తూరు, నెల్లూరు డ్వామా ఏపీఓ(ఎంఅండ్‌ఈ) ఎం.ధనలక్ష్మిని డ్వామా పలమనేరు, తిరుపతి ఎంపీడీఓ రామచంద్రను డీడీఓ పలమనేరు, వైఎస్సార్ జిల్లా సంపేపల్లె ఎంపీడీఓ ఎన్.రామచంద్రను కుప్పం డీడీఓగా నియమించారు. శ్రీకాళహస్తి వెటర్నరీ ఆఫీసర్ అమర్‌నాథ్‌ను అక్కడే కొనసాగించేలా ఆదేశాల్లో పేర్కొన్నారు.
నేడు కలెక్టరేట్ ఎదుట దివ్యాంగుల ధర్నా
చిత్తూరు కలెక్టరేట్ : దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు దివ్యాంగుల జేఏసీ నేతలు కొణతం చంద్రశేఖర్, మురళి వెల్లడించారు. ఆదివారం వారు మాట్లాడుతూ త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన దివ్యాంగుల్లో ఒక్కొక్కరికి రూ.1.07 లక్షల విలువ చేసే మూడు చక్రాల స్కూటర్ పంపిణీ చేయనున్నారన్నారు. ఇందులో వైకల్య శాతం 70 శాతం కంటే ఎక్కువ ఉంటేనే స్కూటర్ అందిస్తామని నిబంధన విధించడం సరికాదన్నారు. సదరం సర్టిఫికెట్ల రీవెరిఫికేషన్‌లో చాలా మంది దివ్యాంగుల వైకల్యశాతం తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే అక్టోబర్‌లో పంపిణీ చేసే పింఛన్లపై సైతం స్పష్టత లేదన్నారు. ఈ క్రమంలోనే కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగనున్నట్లు వివరించారు. జిల్లాలోని దివ్యాంగులు ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్ వద్దకు రావాలని పిలుపునిచ్చారు.