
ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్
చిత్తూరు కలెక్టరేట్ : వివిధ ప్రాంతాల ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సోమవారం ధర్నాలు నిర్వహించడంతో కలెక్టరేట్ దద్దరిల్లింది. మండుటెండను సైతం లెక్క చేయకుండా ధర్నాలు నిర్వహించారు. కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
పేదల ఇళ్లపై దౌర్జన్యం
60 ఏళ్లుగా నివాసముంటున్న 93 కుటుంబాల ఇళ్లను కూల్చేసి ఆ భూమిని ఆక్రమించుకునేందుకు సతీష్ అనే వ్యక్తి ప్రయత్నిస్తున్నట్లు పెనుమూరు మండలం, దాసరపల్లె గ్రామస్తులు ఆరోపించారు. ఈ మేరకు ఆ గ్రామానికి చెందిన ప్రజల అధిక సంఖ్యలో కలెక్టరేట్‌కు విచ్చేసి ధర్నా నిర్వహించారు. వారి ధర్నాకు సీపీఎం నేతలు మద్దతు పలికారు. గ్రామస్తులు మాట్లాడుతూ దాసరపల్లిలో సర్వే నం.7లో గత 60 ఏళ్లుగా 93 కుటుంబాలు నివసిస్తున్నట్లు తెలిపారు. తమ గ్రామంలో రెండు బోరు మోటార్లు, ప్రభుత్వ పాఠశాల, నీళ్ల ట్యాంకు, ఆలయంతో పాటు 93 కుటుంబాలు ఉన్నట్టు తెలిపారు. ఆ ఇళ్లను ప్రస్తుతం కూల్చేసి భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి పన్ను, కరెంట్ బిల్లులు చెల్లిస్తున్నామని, అయినా ఇళ్లను కూల్చేసేందుకు నోటీసులు పంపి బెదిరిస్తున్నారన్నారు. గతంలో సర్వే నం.7లో మేత బీడు పోరంబోకుగా ఉండేదన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఈ భూమిని మేత భూమి నుంచి మినహాయిస్తూ ఉత్తర్వులు సైతం ఇచ్చిందన్నారు. అయితే ప్రస్తుతం పెనుమూరు తహసీల్దార్ మొత్తం భూమిని స్వాధీనం చేయాలంటూ ఆదేశాలివ్వడం దారుణమన్నారు. తమ సమస్యను పరిష్కరించి న్యాయం చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో గ్రామస్తులు రాజారెడ్డి, రామకృష్ణారెడ్డి, మునిలక్ష్మి, విజయ, సుజాత, రాణి తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగులను అవమానిస్తూ..అపహేళన చేస్తూ!
కూటమి ప్రభుత్వం దివ్యాంగులను అవమానిస్తూ.. అపహేళన చేస్తూ కించపరుస్తోందని ఏపీ దివ్యాంగ సంఘాల ఐక్య కార్యచరణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కొణతం చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు మురళి ఆరోపించారు. ఈ మేరకు ఆ సంఘ నాయకులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నిస్సహాయులైన దివ్యాంగులపై చేస్తున్న దాడికి ప్రతిరూపమే రీ వెరిఫికేషన్ ప్రక్రియ అని అభివర్ణించారు. రీ వెరిఫికేషన్‌లో వికలత్వ శాతం తగ్గించి దివ్యాంగుల పొట్ట కొట్టడం అన్యాయమన్నారు. దివ్యాంగులను ద్వేషిస్తూ, కించపరుస్తూ, వికలత్వాన్ని సొమ్ము చేసుకునేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నించడం దారుణమన్నారు. పూర్తిగా మంచానికి, వీల్‌చైర్‌కు పరిమితమైన దివ్యాంగులను రూ.15 వేల పింఛన్‌కు అర్హులుగా పరిగణించాలని డిమాండ్ చేశారు. 70 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉండాలనే నిబంధన పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. తమ డిమాండ్‌లను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఈ ధర్నాలో ఆ సంఘం జిల్లా మహిళా అధ్యక్షురాలు సుమతి, నేతలు చిరంజీవి, సుబ్రహ్మణ్యం, లీలాపతినాయుడు, రమేష్ పాల్గొన్నారు.
పీజీఆర్‌ఎస్ భవనం ఎదుట మండుటెండలో బైఠాయించిన వెదురుకుప్పం మండలం, బందార్లపల్లె గ్రామస్తులు, ధర్నాను అడ్డుకుంటున్న పోలీసులతో గ్రామస్తుల వాగ్వాదం
ధర్నా నిర్వహిస్తున్న దాసరపల్లె గ్రామస్తులు
దివ్యాంగుల ధర్నా
జీతాలు లేక
అలమటిస్తున్నా..
కూటమి ప్రభుత్వంలో గ్రీన్ అంబాసిడర్లు జీతాలు లేక అలమటిస్తున్నారని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ సంఘ నాయకులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో 25 నెలలుగా పెండింగ్‌లో ఉన్న గ్రీన్ అంబాసిడర్‌ల జీతాలను వెంటనే మంజూరు చేయాలన్నారు. జిల్లా గౌరవ అధ్యక్షులు నాగరాజు, సీపీఐ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి శివారెడ్డిలు మాట్లాడుతూ కార్మికుల పంచాయతీల్లో పారిశుద్ధ్య పనులు చేస్తున్నప్పటికీ వారి జీతాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. వారికి ప్రతి నెలా ఇచ్చే రూ.6 వేలు సైతం ఇవ్వకపోవడం దారుణమన్నారు. ధర్నాలో నగర కార్యదర్శి దాసరిచంద్ర, నాయకులు రమాదేవి, కవిత, రాజేంద్రన్, గోవిందస్వామి పాల్గొన్నారు.
న్యాయం చేసే వరకు కదిలేదే లేదు
తమకు న్యాయం చేసే వరకు కదిలేదే లేదు అంటూ వెదురుకుప్పం మండలం బందార్లపల్లె గ్రామస్తులు పీజీఆర్‌ఎస్ భవనం ముందు ధర్నా నిర్వహించారు. ఆ గ్రామానికి చెందిన ప్రజలు అధిక సంఖ్యలో కలెక్టరేట్‌కు విచ్చేసి టీడీపీ నేతల దౌర్జన్యాన్ని ఎండగట్టారు. న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. గంటల తరబడి పీజీఆర్‌ఎస్ భవనం ఎదుట బైఠాయించారు. ఆ గ్రామస్తులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా స్వల్ప వాగ్వాదం నెలకుంది. ఈ ధర్నాలో జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ సొంత తమ్ముడు నిది గ్రామస్తులకు మద్దతుగా పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. ఆ గ్రామస్తులు మాట్లాడుతూ బందార్లపల్లె గ్రామానికి సమీపంలో ఎద్దలబండ వద్ద టీడీపీ నేత యుగంధర్‌నాయుడు తదితరులు క్వారీ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారన్నారు. ఆ క్వారీ ప్రారంభమైతే తమ పంట పొలాలు నాశనమవుతాయన్నారు. క్వారీ ప్రారంభించకూడదని ప్రశ్నించినందుకు తమ పై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ స్పందిస్తూ క్వారీ ఆపివేసేలా ఆదేశిస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.

ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్

ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్

ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్