
వెట్టిచాకిరీ నుంచి విముక్తి
గంగాధర నెల్లూరు: వెట్టి చాకిరీ నుంచి ఓ కుటుంబానికి అధికారులు విముక్తి కల్పించారు. వివరాలు.. పెనుమూరు మండలం, పూనేపల్లి గ్రామానికి చెందిన నందిని కుటుంబ సభ్యులు జీడీ నెల్లూరు మండలం, కోటగరం పంచాయతీ, ఎట్టెరి గ్రామానికి చెందిన ఓ సిమెంట్ ఇటుకల వ్యాపారి వద్ద లక్ష రూపాయలు అప్పు తీసుకున్నారు. దీనికి బదులుగా గత ఏడాది పాటు తా కుటుంబాన్ని పెట్టి చాకిరీ చేయిస్తున్నాడు. ఈ విషయం చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలోని ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా నందిని కుటుంబ సభ్యులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు ఆర్డీఓ శ్రీనివాసులు సోమవారం బాధితులను కలిసి సమస్యలపై ఆరా తీశారు. అనంతరం సదరు యజమానితో మాట్లాడి వెట్టిచాకిరీ నుంచి విముక్తి కలిగించారు. తహసీల్దార్ శ్రీనివాసులు, ఏఎస్‌ఐ మురళి పాల్గొన్నారు.
బాలికపై లైంగిక వేధింపులు
– నిందితుడికి జైలు, జరిమానా
చిత్తూరు లీగల్: మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ లోకేష్ (30) అనే నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ చిత్తూరులోని పోక్సో కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. పోక్సో న్యాయస్థానం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ మోహనకుమారి కథనం మేరకు.. కార్వేటినగరానికి చెందిన లోకేష్ 2021లో ఓ మైనర్ బాలికను తనతో ఫోన్‌లో మాట్లాడాలని బలవంతం చేసేవాడు. ఓ రోజు బాలికను బెదిరించి తన ఇంటికి పిలిపించుకుని, ఆమెకు అశ్లీల వీడియోలు చూపించి.. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఇలా పలుమార్లు చేయడంతో బాలిక, జరిగిన విషయం తన కుటుంబ సభ్యులకు చెప్పింది. ఓ రోజు బాలికతో పాటు ఆమె తల్లి గన్నేరు పప్పు తిని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. విషయం పోలీసులకు తెలియడంతో విచారించి, లోకేష్‌పై పోక్సో కింద కేసు నమోదుచేసి కోర్టుకు తరలించారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి జైలుశిక్ష, రూ.50 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి శంకరరావు తీర్పునిచ్చారు. బాధిత బాలిక కుటుంబానికి రూ.50 వేలు పరిహారం అందజేయాలని చిత్తూరు ఆర్డీఓను జడ్జి ఆదేశించారు.