
అమ్మవారి శిరస్సు చోరీ
– నిందితుల అరెస్ట్
ఐరాల : పురాతనమైన పాలేటమ్మ ఆలయంలో అమ్మవారి శిరస్సును చోరీ చేసిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ఐరాలకు చెందిన శ్రీరాములు, కురప్పపల్లెకు చెందిన హరి, వైఎస్ గేటుకు చెందిన జయరామ్‌తోపాటు, పాకాల మండలం గానుగపెంటకు చెందిన నీల అనే మహిళ ఆలయంలో పూజలు నిర్వహించే సాకుతో ప్రవేశించారు. ఎవరూ లేని సమయం చూసి అమ్మవారి శిరస్సును అపహరించారు. హరి, శ్రీరాములు ముందుగా అక్కడి నుంచి పరారయ్యారు.
శిరస్సు ఉంచిన బ్యాగులో నీల, జయరామ్ ద్విచక్రవాహనంలో చిత్తూరు వైపు వెళ్లిపోయారు. కాసేపటి తర్వాత పూజ చేసేందుకు వచ్చిన భక్తులు అమ్మవారి శిరస్సు కనిపించకపోవడంతోఆలయ వంశపార్యంపర ధర్మకర్త బాలాజీకి సమాచారం అందించారు. ఆయన ఆలయానికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై గాలింపు చర్యలు చేపట్టగా చింతగుప్పలపల్లె వద్ద ద్విచక్రవాహనంలో అమ్మవారి శిరస్సుతో వెళుతున్న జయరామ్, నీల పట్టుబడ్డారు. అనంతరం శ్రీరాములు, హరిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చోరీకి ప్రధాన సూత్రధారి శ్రీరాములుగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆలయంలో ప్రత్యేక పూజలు
పాలేటమ్మ ఆలయంలో చోరీకి గురైన అమ్మవారి శిరస్సు తిరిగి అదే స్థానంలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రోక్షణ, అభిషేకాలు చేపట్టారు.