
ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడి మృతి
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో ఆర్టీసీ బస్సు ఢీకొని దేవరాజు (28) అనే యువకుడు మృతి చెందాడు. నగరిలోని సత్రవాడకు చెందిన దేవరాజు ఓ ప్రైవేటు డెయిరీలో పనిచేస్తున్నాడు. గురువారం చిత్తూరుకు వచ్చిన అతను ద్విచక్ర వాహనంలో స్థానిక ఆర్టీసీ బస్సు లోపలకి వెళ్లడానికి ప్రయత్నించాడు. ఇంతలో కుప్పం నుంచి చిత్తూరు వస్తున్న ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో దేవరాజు టైర్ కింద పడి గాయపడ్డాడు. చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ట్రాఫిక్ సీఐ లక్ష్మీనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తల్లికి భోజనం తీసుకుని వస్తూ..
తవణంపల్లె: తిరుపతి– బెంగళూరు హైవేలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు తవణంపల్లె ఎస్‌ఐ చిరంజీవి తెలిపారు. ఎస్‌ఐ కథనం.. తెల్లగుండ్లపల్లె దళితవాడకు చెందిన వెంకటస్వామి కుమారుడు ఎ.శేఖర్(54) ద్విచక్ర వాహనంలో పైపల్లె క్రాస్ రోడ్డు నుంచి అతని తల్లికి భోజనం తీసుకొని ఇంటికి వస్తున్నాడు. హైవేలో నుంచి సర్వీసు రోడ్డులో రాజశేఖర్ కోళ్లఫారం దగ్గర గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ప్రమాదంలో తీవ్రగాయాలు తగలడంతో శేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. తన తమ్ముడు గణపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
పులిచెర్ల(కల్లూరు): బంధువుల ఇంటికి వచ్చి ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగి వెళ్తూ ఎదురుగా ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఒకరు మృతిచెందారు. మరో ఇద్దరికి రక్తగాయాలయ్యాయి. పోలీసుల కథనం..చిత్తూరు సమీపం కొత్తూరు ఎస్టీ కాలనీకి చెందిన మురళి(40), అనూష, శరవణన్ రెండు రోజుల క్రితం పాతపేటకు ద్విచక్ర వాహనంలో బంధువుల ఇంటికి వచ్చారు. గురువారం ఉదయం తిరుగు ప్రయాణంలో పాతపేట నుంచి కల్లూరు–సదుం రోడ్డుపై వెళ్తుండగా కల్లూరు నుంచి ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టింది. ద్విచక్ర వాహం నడుపుతున్న మురళి (40) అక్కడికక్కడే మృతి చెందగా, మిగిలిన ఇద్దరికి తీవ్ర గాయాలయ్యియి. కల్లూరు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడి మృతి